Vijayawada | పున్నమి ఘాట్‌లో దసరా మెగా సంబరం

  • 19 ఎకరాల్లో వేడుకల సందడి
  • 1,000 స్టాళ్లకు ఏర్పాట్లు
  • గ్రామీణ కళాకారులు.. చేతివృత్తిదారులకు పెద్ద వేదిక
  • డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్‌
  • వినోదం.. సంస్కృతి.. సంప్రదాయ ఉత్పత్తుల ప్రదర్శన
  • ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ లు చిన్ని, సానా సతీష్‌బాబు
  • పార్కింగ్‌, భద్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ నగరంలో ఈసారి ఉత్సవాల సందడి మరింత పెరగనుంది. పున్నమి ఘాట్‌ వేదికగా నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్‌–సరస్‌’ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 19 ఎకరాల విస్తీర్ణంలో 1,000 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాలతో పాటు గ్రామీణ కళాకారులు, చేతివృత్తిదారులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే అవకాశం కల్పించనున్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీలు

కార్యక్రమం నిర్వహణ ప్రాంతాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు, నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యాన్‌చంద్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

గ్రామీణ ఉత్పత్తులకు గిరాకీ

‘సరస్‌’ ద్వారా గ్రామీణ ప్రాంతాల కళాకారులు, చేతివృత్తిదారులు, డ్వాక్రా మహిళలు తయారు చేసిన హస్తకళలు, సంప్రదాయ వస్తువులు, ఆహార పదార్థాలు తదితరాలను విక్రయించుకునే అవకాశం కలగనుంది. తద్వారా వారికి నేరుగా మార్కెట్‌ లభించడంతో పాటు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గ్రామీణ కళలు, సంప్రదాయ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభిస్తుందని పేర్కొన్నారు.

వినోదంతో పాటు వాణిజ్య వేదిక.

పున్నమి ఘాట్‌ వంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా నగరవాసులకు వినోదం, సాంస్కృతిక అనుభూతితో పాటు స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత, విద్యుత్‌, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని అధికారులను ఆదేశించారు. మహిళలు, కుటుంబాలతో వచ్చే సందర్శకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులను కోరారు.

సమన్వయంతో పగడ్బందీ ఏర్పాట్లు..

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. విజయవాడ ఉత్సవ్‌–సరస్‌ను విజయవంతంగా నిర్వహించి నగర ప్రజలకు మంచి అనుభూతిని అందించేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులను కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.