నంద్యాల బ్యూరో, మార్చి 15, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అహోబిలంలోని శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ బాగుండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న శ్రీ అహోబిలం నరసింహ స్వామి ఆలయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందర్శించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విజయానంద్ కు అహోబిలం పీఠాధిపతి ముద్రకర్త కిడాంబి వేణుగోపాలన్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తరువాత ఆలయంలోని రంగ మండపంలో వేద ఆశీర్వాదం చేశారు. అహోబిలం మఠంలో 46వ పీఠాధిపతి వారిని దర్శించుకున్నారు. విజయానంద్ వెంట జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఇతర పోలీస్, రెవెన్యూ అధికారులు, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.