Vijay Ajith Hug Viral Video | వైరల్‌ అవుతున్న స్టార్‌ మూమెంట్‌

  • హీరో అజిత్‌ ను కౌగిలించుకునేందుకు సీఎం విజయ్‌ పరుగు
  • సోషల్‌ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • సిల్వర్‌స్టోన్ రేసింగ్‌ సర్క్యూట్‌లో ఇద్దరు స్టార్ హీరోల కలయిక

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌ను కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యూకేలోని సిల్వర్‌స్టోన్ రేసింగ్‌ సర్క్యూట్‌లో జరిగిన ఈ భేటీ అభిమానులను ఆకట్టుకుంటోంది. మిషెలిన్ లె మాన్స్ కప్‌ సిల్వర్‌స్టోన్ రౌండ్‌కు ముందు అజిత్‌ స్వయంగా విజయ్‌కు స్వాగతం పలికారు. అజిత్‌ను చూసిన విజయ్‌ ఆయనను కౌగిలించుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అజిత్‌ రేసింగ్‌కు మద్దతు తెలిపేందుకు విజయ్‌ యూకే వెళ్లారు. శనివారం జరగనున్న రేసును ఆయన అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నటీమణులు రాధిక శరత్‌కుమార్‌, త్రిషా కృష్ణన్‌ కూడా లండన్‌ నుంచి ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. అజిత్‌కు రేస్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో అజిత్‌ అభిమానులతో మాట్లాడిన వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

రేసులో అజిత్‌ పోటీ..

నటనతో పాటు మోటార్‌స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్న అజిత్‌ కుమార్‌ సిల్వర్‌స్టోన్ రౌండ్‌లో పాల్గొంటున్నారు. అజిత్‌ రెడ్‌ఆంట్‌ బై విరాజ్‌ జట్టు తరఫున ఫ్రెంచ్‌ డ్రైవర్‌ రోమైన్‌ వోజ్నియాక్‌తో కలిసి ఎల్‌ఎంపీ3 ప్రో/ఆమ్‌ విభాగంలో రేస్‌ చేయనున్నారు.ఈ రేసులో భారత మాజీ ఫార్ములా వన్‌ డ్రైవర్‌ నరైన్‌ కార్తికేయన్‌, ఆదిత్య పటేల్‌ కూడా పాల్గొంటున్నారు. విజయ్‌ ఈ కార్యక్రమానికి హాజరై రేసు ప్రారంభానికి సంబంధించిన గ్రీన్‌ ఫ్లాగ్‌ ఊపనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 44 కార్లతో జరిగే ఈ రేసు శనివారం రాత్రి 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) జరగనుంది. అజిత్‌, విజయ్‌ కలయికతో ఈ రేసింగ్‌ ఈవెంట్‌ మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది.