వరంగల్ నగరంలో ఒక రోజు ముందే ఉగాది పండగ వచ్చింది. 2500 కోట్ల రూపాయలకు పైగా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కోలాహాలంగా మారింది. ఉగాది పచ్చడి కోసం స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు రాంపూర్ లో 8 లక్షల లీటర్ల సామర్ధ్యం గల ) మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను మంత్రులు కేటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు కలిసి ప్రారంభోత్సవం చేశారు. వరంగల్ నగర వాసులకు ప్రతి రోజూ స్వచ్ఛమైన నీరందించే మిషన్ భగీరథకోసం కింద 1589 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు. అనంతరం వరంగల్ నగరం ఎల్బీ నగర్ లో నిర్మిస్తున్న షాదీ ఖానా మరియు మండి బజార్ లో రూ. 2.35 కోట్లతో నిర్మిస్తున్న హజ్ హౌజ్ పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేశాయ్‌పేటలో 10 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించే జర్నలిస్ట్ కాలనీకి భూమిపూజ చేశారు. దూపకుంట వద్ద 600 మంది లబ్ధిదారుల కోసం.. 31 కోట్ల 80 లక్షల వ్యయంతో, ఎస్ఆర్ నగర్లో 13 కోట్ల వ్యయంతో నిర్మించే రెండు పడకల గదులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురంలో 6 కోట్ల 24 లక్షల వ్యయంతో నిర్మించిన పండ్ల మార్కెట్‌ను ప్రారంభించారు. శివనగర్ వద్ద 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జినీ ప్రారంభించారు.అనంతరం వరంగల్ తూర్పు నియోజక వర్గంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో కేటిఆర్ మాట్లాడుతూ,
“ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా మా నాయకుడు కేసిఆర్ అని నేడు ఇంత పెద్ద ఎత్తున వచ్చి తెలియజెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాకముందు ఎలా ఉంది, వచ్చాక ఎలా ఉంది మీరే చూడండి. ఒకప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లు 75 రూపాయలు ఇచ్చేవాడు. వాడకట్టులో 50 మందికి వస్తే 500 మందికి రాకపోయేది. ఈ 500 పెన్షన్ అడిగితే వచ్చే వారిలో ఎవరో ఒకరు సస్తే మీ పేరు రాస్తమనేటోళ్లు. కాంగ్రెసోళ్లు వచ్చి 75 రూపాయలను 200 రూపాయల చేసి, భారతదేశంలో ఎవరూ చేయనట్లు వారే చేశామని డైలాగులు కొట్టారు. ముసలోళ్లు మందుగోలీలు వేసుకునేందుకు ఆటో ఖర్చులకు సరిపోలేదు వారిచ్చినవి. కానీ చారాన కోడికి బారాన ప్రచారం చేసుకున్నారు.
తెలంగాణ కోసం ఏ ఆడబిడ్డలు వంటవార్పు చేశారో, ఎవరు కొట్లాడారో వారి ముఖాల మీద చిరునవ్వు చూడడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో పెన్షన్ ను 2000 రూపాయలు చేసుకున్నాం. పది రెట్టు పెంచుకున్నాం. గతంలో 29 లక్షల మందికే పెన్షన్ వచ్చేది. కానీ తెలంగాణ వచ్చాక మరో 11 లక్షల మందికి కొత్తగా ఇస్తూ మొత్తంగా 40 లక్షల మందికి 10వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో అమ్మమ్మ దగ్గరకు మనవళ్లు వెళ్లి చాక్లెట్ కొనుక్కుంటా, బిస్కెట్ కొనుక్కుంటా అని అడిగితే పైసలు లేవన్న రోజు నుంచి నేడు మనవళ్లు దగ్గరకు రాగానే 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ పొడ తెచ్చుకో అనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పాలనలో ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోలు ఇచ్చి సరిపెట్టుకోవాలన్నారు. కానీ కేసిఆర్ సిఎం అయ్యాక, పేదవాడికి ఇచ్చే బియ్యంలో కోత పెట్టొద్దు అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఇది పేదవాళ్ల సంక్షేమ ప్రభుత్వం. అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేద ఆడపిల్ల గర్భం దాల్చితే పనిచేయకుండా ఉండడానికి మగబిడ్డ కోసం 12వేలు, ఆడబిడ్డ కోసం 13వేలరూపాయలు ఇస్తున్నారు.
ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాను నేడు కేసిఆర్ కిట్ లు ఇస్తూ సర్కారు దవాఖానాల్లో డెలివరీలు పెంచారు. మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణలో నేడు పుడితే పైసలు. బడికి పోతే బ్రహ్మండమైన భోజనం, విద్య అందుతున్నాయి. ముఖ్యమంత్రి మనమడు, మనమరాలు ఏ బియ్యం తింటున్నారో అవే బియ్యం గురుకులాల్లో పిల్లలకు తిన్నంత పెడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 200 పైచిలుకు గురుకులాలు ఉంటే నేడు 1079 గురుకులాలు పెట్టి అన్ని వర్గాల పేదల పిల్లలకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,25,000 ఖర్చు పెట్టి అన్ని వసతులు కల్పిస్తోంది. 4.5 లక్షల పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందుతోంది. 18 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంకా ఉన్నత విద్య చదువడానికి విదేశాల్లో చదవడానికి ఒక్కోక్క విద్యార్థికి 20లక్షల రూపాయలు ఇస్తుంది కేసిఆర్ ప్రభుత్వం కాదా? దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కరెంటు కష్టాలు ఎలా ఉండెనో గుర్తు తెచ్చుకోవాలి? కానీ ఈ రోజు కరెంటు ఎలా ఉంది గుర్తు తెచ్చుకోవాలి. నాడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త. వరంగల్ పట్టణంలోని ఆడబిడ్డల దాహార్తికి 1589 కోట్ల రూపాయలతో చేస్తామని మాట ఇచ్చి ఉగాదికి ఒక రోజు ముందే చేసిన ప్రభుత్వం ఇది. ఒకనాడు బిందెలు పట్టుకుని ట్యాంకర్ల వద్ద యుద్దాలు చేసేటోళ్లు. కానీ కేసిఆర్ పాలనలో నేడు అలాంటి పరిస్థితి లేదు. ఇంటింటికి నల్లా వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసూ చూడు అంటారు…కానీ సిఎం కేసిఆర్ ఇళ్లు నేనే కడుతా, పెళ్లి నేనే చేస్తా అంటున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు బిజెపి వాళ్లు ఎగెరెగిరి పడుతున్నారు. నరేంద్ర మోడీ ఆనాడు జన్ ధన్ ఖాతా ఖోలో పంద్రా లాక్ లేలో అన్నారు. ఇందులో 15 లక్షలు ఎంతమందికి వచ్చాయో చెప్పండి. కాంగ్రెసోళ్లది మొండి చెయ్యి, బిజపిది గుడ్డి చెయ్యి. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మాట ఇచ్చారు వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని, ఈరోజ అడిగితే బేబే అని అంటున్నారు. వారికి మాటలు రావు. మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీకి మాట ఇచ్చి ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. మనకు 2014లో మాట ఇచ్చి మొండి చెయ్యి చూపుతున్నారు. ప్రధానిగారు అచ్చేదిన్ ఆయేంగే అన్నారు. ఈ ప్రధాని రాకముందు సిలిండర్ ధర 440 రూపాయలు ఆనాడు. ఈరోజు ఏ రేటు ఉందో మీకే తెలుసు. ఇవేనా అచ్చేదిన్ అంటే? నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను పట్టుకుని మీ చేతగాని తనం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు నరేంద్రమోడీ గారు. సిలిండర్ ధరకు దండం పెట్టుకుని వెళ్లమన్నాడు. మరి ఈ రోజు ఎలా ఉన్నాయి ధరలు. నేడు మా యువత పెట్రోల్ కు వెళ్లి క్రికెట్ లో సెంచరీ చేస్తే హెల్మెట్ పైకి లేపి చూసినట్లు క్యాప్ లేపి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కి వరంగల్ మీద ప్రేమ ఉండడం వల్లే బడ్జెట్ లో ఏటా 300 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. వరంగల్ పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఖర్చు జరుగుతుంది. 2500 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు నేడు ప్రారంభం, శంకుస్థాపనలు చేసుకున్నాం. వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు నేను వచ్చి నాలాలకు అడ్డం ఉన్న భవనాలను కూల్చమన్నాము. కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తెలంగాణ ప్యూచర్ సిటీగా వరంగల్ నగరం కానుంది. వరంగల్ నగరానికి మెట్రో రైల్ తెచ్చే బాధ్యత మాది. ప్రత్యేక కమిట్ మెంట్, కార్యాచరణ ఉంది మాకు. పనిచేసే ప్రభుత్వం, మీకోసం ఉండే ప్రభుత్వం, పేదవాన్ని కడుపులో పెట్టుకునే చూసుకునే ప్రభుత్వం ఇది. గత ఆరేళ్లుగా ఏకపక్షంగా ఎలాంటి తీర్పు ఇస్తున్నారో…అదే తీర్పును రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో ఇవ్వాలని కోరుతున్నాను. మీ ఆశీర్వాదం, ప్రోత్సాహం ఉంటే మరింత వేగంగా ఉత్సాహంగా పనిచేస్తామని చెబుతున్నాను. కొంతమందికి కొత్తగా ఇండ్లు, పెన్షన్లు, కార్డులు ఇచ్చుకునేది ఉంది. కరోనా వల్ల ఆదాయం 50వేల కోట్లకు పైగా నష్టం జరిగింది. అయినా పేదవాని సంక్షేమం ఆపలేదు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలుష అంటూ కెసిఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, ” నేడు రెండువేల కోట్ల రూపాయలకు పైగా పనులు ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం సంతోషం. ఏడేళ్ల ముందున్న వరంగల్ కు , గత ఏఢేళ్ల తర్వాత వరంగల్ కు తేడా చూస్తున్నాం. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న వరంగల్ నగరం గతంలో కొంత నిర్లక్ష్యానికి గురైనా… సిఎం కేసిఆర్ చల్లని చూపుతో నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. మన అవసరాలు గుర్తించి తీరుస్తున్నారు. ఇలా మనకు అండగా ఉండే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఎన్నికలు వస్తున్నాయని కొన్ని పార్టీలు పగటి వేశగాళ్ల వలె ముందుకు వస్తున్నాయి. ఇలాంటి వారికి మనం బుద్ధి చెప్పాలి. కేసిఆర్ ని నిండు మనసుతో ఆశీర్వదించి, టిఆర్ఎస్ ను గెలిపించి ఈ అభివృద్ధిని కొనసాగించాలి” అని అన్నారు.
మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ నగర రూపురేఖలు మార్చి అందమైన నగరంగా మార్చారు. ఏ మొఖం పెట్టుకుని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఓట్లు అడుగతాయి. ఏం చేశారని అడుగుతారు. ఇంటింటికి ఫిల్టర్ వాటర్ ఇస్తున్న మహానుభావులు సిఎం కేసిఆర్. . నల్లా లేకపోతే దరఖాస్తు పెట్టుకుంటే వారం రోజుల్లో ఇస్తారు. గోదావరి, కృష్ణానది నుంచి పైపులైన్లు వేసి స్వచ్ఛమైన నీరు తెచ్చి ఇంటింటికి ఇస్తున్నారు. కేసిఆర్ వచ్చాకే వరంగల్ జిల్లా, తెలంగాణ బాగుపడుతున్నది. ముసలోల్లకు రెండువేల పెన్షన్ ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు పైసలు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ లోన్లు ఇస్తున్నారు. ఆరోజు కాకతీయులు పాలించినప్పుడు ఎలా ఉందో.. నేడు కేసిఆర్ పాలనలో వరంగల్ అలా ఉంది. బిజెపి వాళ్లు కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తానని చెప్పి, గిరిజన యూనివర్శిటీ తెస్తామని తేలేదు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వని బిజెపికి, తెలంగాణను అభివృద్ధి చేయని కాంగ్రెస్ కు ఓటేద్దామా?, గోదావరి నీళ్లను తెచ్చి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న టిఆర్ఎస్ కు ఓటేద్దామా? మీరే నిర్ణయించుకోవాలి” అని కోరారు.. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌లో ఒక రోజు ముందే ఉగాది – రూ.2500 కోట్ల అభివృద్ధి పనులకు కెటిఆర్ శ్రీకారం..
Advertisement
తాజా వార్తలు
Advertisement