video viral | కర్నూలు బస్సు దుర్ఘటనపై షాకింగ్ వీడియో…

  • మనసు కలిచివేస్తున్న దృశ్యాలు
  • పల్సర్ బైక్ ప్రమాదం తర్వాత నిర్లక్ష్యమే ప్రాణాంతకం!
  • వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో 19 మంది బలి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: గత నెల 24న కల్లూరు మండలంలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. కర్నూలు సమీపంలోని వి.కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటనపై బుధవారం ఓ షాకింగ్ వీడియో (video) బయటకు వచ్చింది. ఈ వీడియోలోని దృశ్యాలు మానవ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రమాదానికి ముందు ఏం జరిగిందన్న అంశంపై ఇప్పటివరకు అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, ఈ వీడియో మాత్రం ఘటన క్రమాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

వీడియోలో ఓ పల్సర్ బైక్ రోడ్డుపక్కన పడిపోయి ఉండటం, సమీపంలో శివ అనే యువకుడి మృతదేహం కనిపించడం గమనించవచ్చు. ఇది ఇప్పటికే జరిగిన బైక్ ప్రమాదాన్ని సూచిస్తోంది. అదే మార్గంలో వరుసగా మూడు బస్సులు వెళ్లినా… ఏ ఒక్క డ్రైవర్‌ కూడా ఆ బైక్‌ను పక్కకు తొలగించాలన్నా, ప్రమాద స్థలాన్ని గుర్తించాలన్నా ప్రయత్నం చేయలేదు. ఇదే నిర్లక్ష్యం చివరికి 19 ప్రాణాలను బలి తీసుకుంది.

video viral

కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న వేమూరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్‌ను ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టి, భయంక‌ర‌ దృశ్యాలకు దారి తీశాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు బయటపడేలోపే మంటలు తీవ్రరూపం దాల్చడంతో 19 మంది అగ్నికి ఆహుతయ్యారు.

వీడియో వెలుగులోకి రావడంతో ప్రజల్లో మళ్లీ చర్చ మొదలైంది. మూడు బస్సులు ముందే వెళ్లి ఉంటే ఎందుకు ఆగలేదు?, మానవత్వం ఎక్కడ పోయింది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది సాధారణ ప్రమాదం కాదు.. మానవ నిర్లక్ష్యంతో జరిగిన విషాదం అంటున్నారు.

ఆస్తి కోసం కూతురినే చంపేశారు

Leave a Reply