Video | విక్రాంత్‌పై రఫేల్ ల్యాండింగ్.. చరిత్రాత్మక దృశ్యం !
- తొలి ప్రయత్నంలోనే ల్యాండింగ్..
- చరిత్ర సృష్టించిన రఫేల్ మెరైన్.. ఇదిగో వీడియో!
- ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ల్యాండింగ్ సక్సెస్ !
- తొలి ప్రయత్నంలోనే యుద్ధవిమానం సురక్షితంగా ల్యాండ్
- భారత నావికాదళ చరిత్రలో కీలక ఘట్టం..
- ఆపరేషనల్ ట్రయల్స్‌లో మరో ముందడుగు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :
భారత నావికాదళం మరో కీలక మైలురాయిని అందుకుంది. స్వదేశీ విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మెరైన్ యుద్ధవిమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. గోవాలో కొనసాగుతున్న ట్రయల్స్‌లో భాగంగా ఈ ల్యాండింగ్ జరగ్గా.. తొలి ప్రయత్నంలోనే విమానం సురక్షితంగా డెక్‌పై దిగింది. ఈ విజయానికి సంబంధించిన వీడియోను భారత నావికాదళం శుక్రవారం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది.
రఫేల్ మెరైన్ విమానాన్ని భారత నావికాదళంలో ప్రవేశపెట్టేందుకు జరుగుతున్న పరీక్షల్లో ఈ ల్యాండింగ్ కీలకమైన తొలి అడుగుగా నిలిచిందని నావికాదళం వెల్లడించింది. విమానాన్ని ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ఆపరేట్ చేసేందుకు అవసరమైన మార్పులు, సాంకేతిక అంశాలను ఈ ట్రయల్స్ తో పరిశీలిస్తున్నారు.
ట్రయల్స్ ఎందుకు కీలకం?
రఫేల్ మెరైన్ విమానం మొదటగా క్యాటపల్ట్ అసిస్టెడ్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (క్యాటోబార్) విధానంలో పనిచేసే విమాన వాహక నౌకల కోసం రూపొందించారు. కానీ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (స్టోబార్) విధానం ఉంది. ఇందులో విమానాలు నౌక ముందు భాగంలోని స్కీ-జంప్ ర్యాంప్ సాయంతో గాల్లోకి ఎగురుతాయి. తిరిగి దిగేటప్పుడు విమానంలోని ప్రత్యేక హుక్ సాయంతో డెక్‌పై ఉండే అరెస్టర్ వైర్లను పట్టుకుని ఆగుతాయి.
ఈ రెండు విధానాల్లో సాంకేతిక తేడాలు ఉండటంతో రఫేల్ మెరైన్‌ను విక్రాంత్‌పై నడిపేందుకు ప్రత్యేక పరీక్షలు అవసరం. స్కీ-జంప్ ద్వారా టేకాఫ్, అరెస్టర్ వైర్లతో ల్యాండింగ్, నౌకపై ఉన్న ఇతర సదుపాయాలతో విమానం అనుకూలత వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే భారత నావికాదళంలో రఫేల్ మెరైన్ వినియోగానికి మార్గం మరింత సుగమం కానుంది.
26 రఫేల్ మెరైన్ విమానాల కొనుగోలుకు ఒప్పందం
భారత నావికాదళం మొత్తం 26 రఫేల్ మెరైన్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తోంది. ఈ విమానాల డెలివరీలు 2028 చివర్లో లేదా 2029 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నావికాదళ అవసరాలకు అనుగుణంగా విమానాలను సిద్ధం చేయడం, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై వాటి పనితీరును పరీక్షించడం ప్రస్తుతం జరుగుతోంది.
బహుళ పాత్రలు పోషించే యుద్ధవిమానం
రఫేల్ మెరైన్ రెండు ఇంజిన్లతో పనిచేసే మల్టీరోల్ ఫైటర్ జెట్. గగనతల రక్షణ, నిఘా, శత్రు లక్ష్యాలపై దాడులు, సముద్రంలో శత్రు నౌకలను లక్ష్యంగా చేసుకోవడం వంటి వివిధ ఆపరేషన్లలో ఇది ఉపయోగపడుతుంది. సఫ్రాన్ ఎం88 ఇంజిన్లతో పనిచేసే ఈ విమానం గంటకు సుమారు 2,200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఆధునిక రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు దీని ప్రత్యేకతలు.
మిటియర్, మైకా గగనతల క్షిపణులు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, ఏఎం39 ఎగ్జోసెట్ యాంటీ-షిప్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ల్యాండింగ్ విజయవంతం కావడంతో విమాన వాహక నౌక ఆధారిత యుద్ధ కార్యకలాపాల్లో భారత నావికాదళం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.
