VIDEO | విద్యార్థి సంఘాల పోరు.. రాడ్లు, కర్రలతో ఆస్పత్రిలో వీరంగం!

  • ఎస్‌ఎఫ్‌ఐ–ఎంఎస్‌ఎఫ్‌ మధ్య ఘర్షణ..
  • చికిత్స పొందుతున్న విద్యార్థులపై ఎటాక్ !
  • అత్యవసరవార్డులోకి చొరబడి.. రాడ్లతో దాడి!
  • ఎన్నికల కౌంటింగ్‌ వేళ ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై రాడ్లు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌తో దాడి..

కోజికోడ్‌, ఆంధ్రప్రభ :

విద్యార్థి సంఘం ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా మధ్య మొదలైన ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. కేరళలోని కాలికట్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో.. ఎస్‌ఎఫ్‌ఐ విజయం సాధించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా, ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా మొదలైన ఘర్షణలు ఆస్పత్రి వరకు చేరాయి.

ఈ క్రమంలో ఘర్షణలో గాయపడి కోజికోడ్‌లోని ఆస్పత్రి క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై ఎంఎస్‌ఎఫ్‌ వర్గీయులు రాడ్లు, కర్రలు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్పత్రిలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కలకలం రేపుతున్నాయి.

స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), ముస్లిం స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఎంఎస్‌ఎఫ్‌) కార్యకర్తల మధ్య మొదట మాటామాటా పెరిగి, ఆ తర్వాత తోపులాటకు దారితీసింది. కౌంటింగ్‌ సమయంలో మొదలైన ఈ వివాదం క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. కాగా, ఎన్నికల్లో చివరకు ఎస్‌ఎఫ్‌ఐ విజయం సాధించింది.

ఈ ఘర్షణలో గాయపడిన కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఎంఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు రాడ్లు, కర్రలు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌తో వారిపై దాడి చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైర‌ల్ గా మారాయి. ఆస్పత్రి వార్డులోనే దాడి జరగడం, వైద్య సిబ్బంది సమక్షంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది.

ముక్కుకు ఫ్రాక్చర్‌.. శస్త్రచికిత్స అవసరం

ఈ దాడిలో తమ కార్యకర్తల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ తెలిపింది. ఒక కార్యకర్త ముక్కు విరగడంతో శస్త్రచికిత్స చేయాల్సి ఉందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్‌ వెల్లడించారు. మరో కార్యకర్తపై ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌తో దాడి చేసినట్లు ఆరోపించారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కూడా తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ వీడియో విడుదల చేసినట్లు సమాచారం. అయితే దాడికి సంబంధించి ఇరు విద్యార్థి సంఘాల వాదనలు, పోలీసుల అధికారిక ప్రకటన, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.