హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ మోసంపై బాధితుల ఆగ్రహం

ఆందోళ‌న‌కు సీపీఐ నాయ‌కుల మ‌ద్ద‌తు


దొర్నిపాడు, అక్టోబర్ 17 (ఆంధ్రప్రభ) : దొర్నిపాడు మండలం (Dornipadu Mandal) లో వెలుగుచూసిన హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ మోసంపై బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు రోజులుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై శుక్ర‌వారం బాధితులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

దొర్నిపాడు గ్రామానికి చెందిన వీరారెడ్డి (Veera Reddy), అతని అల్లుళ్లు ఉమా మహేశ్వరెడ్డి, అంతపు రాజారెడ్డి లు కలిసి “హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ” పేరుతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరినుంచి రూ.3,60,000 చొప్పున వసూలు చేసి, మొత్తం రూ.150 కోట్లకు పైగా సొమ్ము దోచుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.


కంపెనీకి ఎటువంటి అధికారిక అనుమతులు లేనప్పటికీ, స్థానిక ప్రజల విశ్వాసాన్ని దోపిడీ చేసినట్లు సమాచారం. హెల్త్ అండ్ వెల్త్ పేరుతో ప్రజల భవిష్యత్తును మోసం చేసిన వీరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


న్యాయం కోసం బాధితులు చేస్తున్న ఈ పోరాటానికి సీపీఐ నేతలు (CPI leaders) మద్దతు తెలిపారు. బాధితులను పరామర్శించిన ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్ మాట్లాడుతూ ప్రజలను ఇలా మోసం చేసే వారిని వదిలిపెట్టం. మోసపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు సీపీఐ వెనక్కి తగ్గదు అని హెచ్చరించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ నాయకులు మురళీధర్, ధనుంజయ్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply