ఇల్లు నిర్మిస్తానని రూ.76 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపణ
నెల్లి రమేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల వేడుకోలు..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి తమ వద్ద నుంచి రూ.76 లక్షలు తీసుకుని మోసం చేశారని 12వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త నెల్లి రమేష్‌పై బాధిత కుటుంబం ఆరోపించింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్ ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ బూసి రాజన్న, ఆయన భార్య బాసి కృప, కుమారుడు బూసి ప్రవీణ్ మాట్లాడారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన సమయంలో కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ రమేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
2019–20లో రమేష్ తమ ఇంటికి వచ్చి ఇల్లు నిర్మించి ఇస్తానని, తనకు సన్నిహితుడైన మేస్త్రీ రమణతో మాట్లాడి నిర్మాణం పూర్తి చేయిస్తానని చెప్పి తమ వద్ద నుంచి రూ.76 లక్షలు తీసుకున్నారని రాజన్న కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అందులో సుమారు రూ.23 లక్షలు మాత్రమే ఖర్చు చేసి నామమాత్రంగా ఇల్లు నిర్మించారని, ఇంకా రూ.53 లక్షలు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
ఇల్లు నిర్మాణం కోసం బ్యాంకు రుణం ఇప్పిస్తానని చెప్పి, మంజూరైన రుణంలో నుంచి మరో రూ.20 లక్షలు కూడా రమేష్ తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ బ్యాంకు పాస్‌బుక్, పాన్‌కార్డు, ఏటీఎం కార్డులను కూడా తన వద్ద ఉంచుకున్నారని, ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై గత నెల 13న ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు, జూన్ 29న టూ టౌన్ ఎస్‌ఐకి ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.
