విభలాపురంలో యువకుడి అనుమానాస్పద మృతి

వాగ్వాదం సందర్భంగా దాడి.. మరుసటి రోజు ఇంట్లో మృతి

మోతె, ఆంధ్రప్రభ : మోతె మండలం విభలాపురం గ్రామంలో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ రాత్రి శ్రీరామ్‌నగర్‌ యూత్‌ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహం వద్ద అన్నదానం నిర్వహించారు. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విగ్రహం వద్ద టెంట్‌ హౌస్‌ గిన్నెలు కడుగుతున్న సమయంలో విభలాపురానికి చెందిన నిమ్మల శ్రీకాంత్‌ (28), అదే గ్రామానికి చెందిన పనస శ్రీనివాస్‌, పనస శ్రీలత మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో శ్రీలత కర్రతో శ్రీకాంత్‌ తల, చెవిపై కొట్టగా, శ్రీనివాస్‌ చేతులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో శ్రీకాంత్‌కు తలపై గాయాలయ్యాయి. అనంతరం శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శ్రీకాంత్‌కు ఫిట్స్‌ వచ్చి ఇంట్లోనే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న మోతె ఎస్సై, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై తెలిపారు.