ఐదేళ్ల తర్వాత తీర్పు.. అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

సిద్దిపేట, ఆంధ్రప్రభ : మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి సిద్దిపేట 1వ అదనపు జిల్లా న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.5,01,000 జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి వై. జయప్రసాద్‌ తీర్పు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. కోహెడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2019 ఏప్రిల్‌ 27న మహిళపై అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న మహిళపై దండవేని ఇస్తారి (58) అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో అప్పటి హుస్నాబాద్‌ సీఐ ఎ. శ్రీనివాస్‌ దర్యాప్తు చేపట్టి, పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం నిందితుడిపై పటిష్టమైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశారు.విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాదుల ఆత్మరాములు వాదనలు వినిపించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కేసు విచారణకు సహకరించారు.

సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు..

కేసులో సమర్పించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు దోషిగా నిర్ధారించింది. దీంతో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5.01 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌ ఐపీఎస్‌ అభినందించారు. మహిళల భద్రతకు పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, నేరస్థులకు శిక్ష పడేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.