కాంగ్రెస్ అబద్ధాలను ఎండగడుతున్నందుకే నాపై దండయాత్ర..

మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
భీమ్‌గల్ అభివృద్ధిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం.
తులం బంగారం అడిగినందుకు లాఠీలతో కొట్టించి, మాపైనే కేసులు పెడతారా?
అధికార గర్వంతో దౌర్జన్యాలకు దిగుతున్న కాంగ్రెస్ నాయకులు.
భీమ్‌గల్ టౌన్, ఫిబ్రవరి 07 ( ఆంధ్రప్రభ ).
భీమ్‌గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ వార్డు లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సభలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత నాలుగైదు రోజులుగా భీమ్‌గల్‌లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే పనులను ఆపివేసిందో, ప్రజలను ఎలా మోసం చేసిందో నేను వివరిస్తున్నాను. నేను చెబుతున్న నిజాలకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి, ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో కాంగ్రెస్ నాయకులు నాపై మాటల దాడులకతెగబడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిపించి భీమ్‌గల్‌లో ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రశాంత్ రెడ్డి భీమ్‌గల్‌కు ఏమీ చేయలేదని ఆయనతో అబద్ధాలు చెప్పించారు. పక్కనే ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన చెవిలో ఊదితే, ఒక బాధ్యతాయుతమైన మంత్రి అయి ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటు.
బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ లు అనిల్, మానాల మోహన్ రెడ్డి లాంటి నాయకులు ప్రభుత్వ కార్లు, పోలీసు జీపులు వేసుకొని నాపై దండయాత్రకు వస్తున్నారు. నేను నిజాలు చెబుతుంటే నన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజల కోసం వాస్తవాలను వెల్లడిస్తూనే ఉంటాను.
మొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్‌గల్ వచ్చినప్పుడు.. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఏది అని ప్రశ్నించినందుకు మమ్మల్ని పోలీసులతో దారుణంగా కొట్టించారు. లాఠీలతో దాడి చేయించడమే కాకుండా, తిరిగి మాపైనే (32 మందిపై) అక్రమ కేసులు పెట్టారు. ఎన్నికల్లో మాట్లాడకూడదని బైండోవర్లు చేస్తున్నారు. దేవుడి సాక్షిగా చెబుతున్నాను, నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం. ఈ దౌర్జన్యాలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
