పెద్ద కాపర్తి పాఠశాల ప్రహరీ గోడని ఢీకొన్న వాహనం

పెద్ద కాపర్తి పాఠశాల ప్రహరీ గోడని ఢీకొన్న వాహనం
పాఠశాల్లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి పాఠశాల ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడ ఒక్కసారిగా కుప్పకూలి సుమారు 70 వేల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. పెద్ద కాపర్తి గ్రామంలోకి వస్తున్న క్రమంలోనే ఏదైనా భారీ లాంటి పెద్ద వాహనం నియంత్రణ కోల్పోయి గోడను ఢీకొట్టి ఉంటుందని భావిస్తున్నారు.
పాఠశాల దరిదాపుల్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు దర్యాప్తుకు సవాలుగా మారింది. దీంతో ఏ వాహనం ఢీ కొట్టిందో గుర్తించేందుకు పాఠశాల సిబ్బంది సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఉన్న వాణిజ్య సముదాయాల సీసీ ఫుటేజీని కోసం వెతుకుతున్నారు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించి, బాధ్యత లేకుండా పరారైన వాహనదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్ఎం తెలిపారు.
పాఠశాల ప్రహరీ గోడ ధ్వంసం కావడంతో విద్యార్థుల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, స్కూల్ జోన్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
