రైతులకు మేలు చేసే వీబీగ్రాంజీ పథకం

పంట కుంటలతో నీటి నిల్వలు పెంపు..
భూగర్భ జలాల వృద్ధికి దోహదం: అడిషనల్‌ డీఆర్‌డీఓ సురేందర్‌ నాయక్‌

చిట్యాల, ఆంధ్రప్రభ : వీబీగ్రాంజీ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అడిషనల్‌ డీఆర్‌డీఓ భూక్యా సురేందర్‌ నాయక్‌ అన్నారు. బుధవారం చిట్యాల మండల కేంద్రంలో రైతు ఇజ్జిగిరి శ్రీనివాస్‌కు ఈ పథకం కింద మంజూరైన పంట కుంట పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సురేందర్‌ నాయక్‌ మాట్లాడుతూ పంట కుంటల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని తెలిపారు. పంటలకు అవసరమైన సమయంలో నిల్వ చేసిన నీటిని వినియోగించుకోవచ్చని చెప్పారు. పంటలకు నీటి రక్షణ కల్పించడంతో పాటు భూగర్భ జలాల వృద్ధికి, చేపల పెంపకానికి కూడా పంట కుంటలు ఉపయోగపడతాయని వివరించారు.

నీటి లభ్యత పెరగడం వల్ల రైతులు వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు పంటల ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంకుడు గుంతలు, ఊటకుంటలు వంటి నీటి సంరక్షణ పనుల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

నీటి నిల్వలు పెరగడం వల్ల గ్రామాల్లో నీటి సమస్యలను కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చని సురేందర్‌ నాయక్‌ వివరించారు. రైతులు నీటి సంరక్షణ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో చిట్యాల నాలుగో వార్డు సభ్యుడు తౌటం నవీన్‌, ఏపీఓ ఎండీ అలీం, టీఏ సుధాకర్‌, రైతు ఇజ్జిగిరి శ్రీనివాస్‌, లావణ్య తదితరులు పాల్గొన్నారు.