ఆలయంలో వరుణ యాగం.. పాల్గొన్న ఎమ్మెల్యే

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 6 ఆంధ్ర‌ప్ర‌భ‌: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రభుత్వం మహా వరుణ యాగాన్ని నిర్వహించింది. ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తకుండా, రైతాంగానికి మేలు జరిగేలా వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో వరుణయాగాలు నిర్వహిస్తున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతు కళ్లలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశం” అని పేర్కొన్నారు. ఈ హోమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ, కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.