గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. బియ్యం బస్తాలపై ప్రభుత్వ లోగోతో అనుమానాలు

వైరా, ఆంధ్రప్రభ: వైరా గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై శనివారం ఉదయం లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడగా, స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా లారీలోని బియ్యం బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. వాటిపై ప్రభుత్వ లోగో ఉండటంతో అవి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై సివిల్‌ సప్లై అధికారులకు సమాచారం అందించి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ ప్రభుత్వ రేషన్‌ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు అధికారికంగా తరలిస్తుంటే, బిల్లులో కర్ణాటకకు వెళ్తున్నట్లు పేర్కొన్న లారీ రాజమండ్రి వైపు ఎందుకు వెళ్తుందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. బియ్యం తరలింపునకు సంబంధించిన పత్రాలు, బిల్లులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. లారీ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళ్లాల్సి ఉంది, బియ్యం అక్రమంగా తరలిస్తున్నారా అనే కోణాల్లో పోలీసులు, సివిల్‌ సప్లై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.