ఆసియా క్రీడ‌ల్లో వైభవ్‌ అరుదైన రికార్డు..

  • 15 ఏళ్లకే గోల్డ్‌ మెడల్‌..
  • సౌరభ్‌ చౌధరి రికార్డు బద్దలు

నగోయా, ఆంధ్రప్రభ : టీమిండియా యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్‌లో ఇప్పటికే తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఆసియా క్రీడల్లోనూ చరిత్ర సృష్టించాడు. 2026 ఆసియా క్రీడల్లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్‌.. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం గెలిచిన అత్యంత పిన్న వయస్కుడైన భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు.

వైభవ్‌ సూర్యవంశీ 15 ఏళ్ల 6 నెలల 10 రోజుల వయసులో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడైన భారత అథ్లెట్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు షూటర్‌ సౌరభ్‌ చౌధరి పేరిట ఉండేది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో సౌరభ్‌ స్వర్ణం గెలిచాడు. అప్పటికి అతడి వయసు 16 ఏళ్లు. తాజాగా వైభవ్‌ ఆ రికార్డును అధిగమించాడు.

అయితే ఆసియా క్రీడల్లో ఏదైనా పతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత అథ్లెట్‌గా మాత్రం వైభవ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సంజనా బతులా 15 ఏళ్ల 3 నెలల 11 రోజుల వయసులో స్పీడ్‌ స్కేటింగ్‌ 3000 మీటర్ల రిలేలో కాంస్యం గెలిచింది. దీంతో ఆమె ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. వైభవ్‌ 15 ఏళ్ల 6 నెలల 10 రోజుల వయసులో పతకం సాధించి రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు ఈ స్థానంలో అనాహత్‌ సింగ్‌ ఉండేది. 2023లో స్క్వాష్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం గెలిచినప్పుడు ఆమె వయసు 15 ఏళ్ల 6 నెలల 16 రోజులు.

ఫైనల్లో మాత్రం వైభవ్‌ సూర్యవంశీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లో 15 పరుగులు చేసి సైమ్‌ అయూబ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే భారత జట్టు మాత్రం మ్యాచ్‌లో పైచేయి సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. భారత్‌ 211/6 స్కోరు చేయగా.. పాకిస్థాన్‌ 192/6కే పరిమితమైంది.