ఉట్నూర్‌ కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలకు యత్నం

గుప్త నిధుల వీడియోలతో మోసానికి ప్రయత్నం.. నలుగురు అరెస్ట్‌

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలకు ప్రయత్నిస్తూ, వాటికి సంబంధించిన వీడియోలను చూపించి ప్రజలను మోసం చేసేందుకు యత్నించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఉట్నూర్‌ ఎస్‌ఐ గుంపుల విజయ్‌ తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, ఆయుర్వేద మందులు, వస్తువులు, కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉట్నూర్‌ మండలం కొత్తగూడ చెక్‌పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జన్నారం వైపు నుంచి ఉట్నూర్‌ వైపు వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ-500 కారును ఆపి తనిఖీ చేయగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వారి సెల్‌ఫోన్లను పరిశీలించగా భూమిని తవ్వుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. దీంతో వారిని విచారించగా గత కొంతకాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఉట్నూర్‌ కోటలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, తవ్వకాలకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ కొందరిని మోసం చేసి వారి నుంచి డబ్బులు పొందాలనే ఉద్దేశంతో ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.

అదేవిధంగా తమ వద్ద ఉన్న ఆయుర్వేద మందులు, ఇతర వస్తువులు వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడతాయని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుల నుంచి తవ్వకాలకు ఉపయోగించే పరికరాలు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆయుర్వేద మందులు, వస్తువులు, కారును స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన కెమెర కిషన్‌, అదే మండలం కొత్తవారిపేటకు చెందిన దుర్గం లింగయ్య, అదే గ్రామానికి చెందిన దుర్గం ప్రవీణ్‌, సిద్దిపేటకు చెందిన దాసరి ఏసుబాబు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలు గుప్త నిధులు, అద్భుత వైద్యం పేరుతో ఎవరైనా చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని ఎస్‌ఐ గుంపుల విజయ్‌ సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఉట్నూర్‌ పోలీసులు పాల్గొన్నారు.