US Plane Crash |కళ్లముందే కూలిన విమానం.. 9 మంది మృతి.. వీడియోలో రికార్డైన షాకింగ్‌ విజువల్స్‌!

  • నివాస ప్రాంతంలో భారీ అగ్నిగోళంగా పేలిన ప్రైవేట్‌ జెట్‌
  • ఇళ్లకు అడుగుల దూరంలో ప్రమాదం.. రోడ్డుపై భారీ గొయ్యి
  • ఆస్టిన్‌ నుంచి బహమాస్‌కు వెళ్తుండగా దుర్ఘటన.. దర్యాప్తు ప్రారంభం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్‌ జెట్‌ విమానం ఆకాశం నుంచి క్షిపణిలా దూసుకొచ్చి నివాస ప్రాంతంలో కూలిపోయింది. నేలను తాకిన మరుక్షణమే భారీ అగ్నిగోళంగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందీ ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ కౌంటీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం కూలిన తీరు, ఆ తర్వాత ఎగసిపడిన మంటలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి.

పామ్‌ బీచ్‌ కౌంటీలోని క్రెస్ట్‌హేవన్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం ఒక్కసారిగా ఆకాశం నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి రద్దీగా ఉండే రహదారిపై కూలిపోయింది. నేలను బలంగా ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. ప్రమాద స్థలాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. రహదారిపై భారీ గొయ్యి ఏర్పడటంతో పాటు విమానం శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.విమానం కూలిన ప్రాంతం ఇళ్లకు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే విమానం కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటుగా వెళ్తున్న వాహనాలు సైతం ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది.

వీడియోల్లో భయానక దృశ్యాలు..

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలె సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అటుగా వెళ్తున్న వాహనాల్లోని కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో ప్రమాదాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోల్లో విమానం వేగంగా కిందకు దూసుకొస్తూ రహదారిని ఢీకొట్టిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడటం కనిపించింది. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా పొగతో నిండిపోవడం, రహదారిపై విమాన శకలాలు చెల్లాచెదురుగా పడటం కలచివేసింది.

ఆస్టిన్‌ నుంచి బహమాస్‌కు వెళ్తుండగా..

అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్‌ డఫీ ఈ ప్రమాదంపై స్పందించారు. విమాన ప్రమాదంలో తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించారు. తూర్పు అమెరికా టైమ్‌ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఆస్టిన్‌ నుంచి బహమాస్‌కు వెళ్తున్న సమయంలో విమానం కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఆస్టిన్‌-బెర్గ్‌స్ట్రోమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి జిమ్‌ రెనాల్డ్స్‌ ఈ విమానం ప్రైవేట్‌గా నడుపుతున్నదని ధ్రువీకరించారు. విమానం టెయిల్‌ నంబర్‌ను N722BDగా గుర్తించినట్లు తెలిపారు. అయితే విమానంలో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఇక తెలియరాలేదని పేర్కొన్నారు.

విమానం ఎందుకు కూలిపోయిందన్న అంశంపై అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) దర్యాప్తు చేపట్టాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు FAA ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. విమానం ప్రయాణించిన మార్గం, సాంకేతిక పరిస్థితులు, ప్రమాదానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలను అధికారులు పరిశీలించనున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.