కేసముద్రం, సెప్టెంబర్ 11(ఆంధ్రప్రభ): విధి నిర్వహణ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాదు, అవసరమైనప్పుడు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమని ఆ పోలీసులు (police) నిరూపించారు. లోడ్ తో వస్తున్న యూరియా లారీ గమ్యం చేరాక పోవడంతో కానిస్టేబుల్ లారీ డ్రైవర్ గా మారి గమ్యం చేరిచిన సంఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలా ఉన్నాయి. కేసముద్రం మండల పరిధిలో యూరియా లోడ్ (Urea load) వస్తుందని రైతులకు అధికారులు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. టోకెన్లు ఇచ్చారుగాని యూరియా లారీ జాడలేదు.

ఈనేపథ్యంలో క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉన్న రైతులు ఆగ్రహంతో యూరియా లారీ జాడేదని అధికారులను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో వరంగల్ (Warangal) నుంచి యూరియా లోడుతో లారీ బయలుదేరిందని, ఇప్పటివరకే ఇక్కడికి రావాల్సి ఉందని సంబందించిన అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు యూరియా లారీ కోసం వరంగల్ నుండి కేసముద్రం వరకు పోలీస్ నెట్వర్క్ ద్వారా గాలింపు చేపట్టారు.

చివరకు కేసముద్రం (kesamudram) విలేజ్ దర్గా వద్ద లారీ నిలిచి ఉన్న విషయాన్ని గుర్తించారు. కాగా లారీ డ్రైవర్ లారీ నడపలేని స్థితిలో మత్తులో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అలీమ్ అనే కానిస్టేబుల్ గతంలో 16 యేండ్లు మిలిటరీలో ఉద్యోగం చేసిన అనుభవంతో వాహనాలు నడపడం వచ్చి ఉండడంతో లారీని తానే డ్రైవ్ చేసి తీసుకువచ్చి కల్వల, ఉప్పరపల్లి కేంద్రాలకు యూరియాను తీసుకొని వచ్చి దిగుమతి చేశారు. స్వయంగా ఖాకీలే స్టీరింగ్ పట్టి, లారీని గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చి అందరి మన్ననలు అందుకున్నారు. వారి సేవానిరతికి ప్రజలు శభాష్ అంటున్నారు. దీంతో రైతులు సైతం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply