80 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు ఇవ్వాలి
ఏడీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్ రైతు విభాగం ధర్నా
ఉరవకొండ, ఆంధ్రప్రభ : రబీ సీజన్లో పప్పుశనగ పంట సాగు చేసేందుకు రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉరవకొండ వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద వైఎస్సార్ రైతు విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకల సిద్ధప్ప మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలు కురవడంతో రబీలో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రబీ సాగు మరింత భారంగా మారుతోందన్నారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరగడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కనీసం 80 శాతం సబ్సిడీతో నాణ్యమైన పప్పుశనగ విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. పది రోజుల క్రితం బహిరంగ మార్కెట్లో పప్పుశనగ క్వింటాలు రూ.6 వేలు ఉండగా, ప్రస్తుతం ధరను రూ.9 వేలకు నిర్ణయించి 35 శాతం సబ్సిడీ పేరుతో రూ.5,500 నుంచి రూ.6 వేల మధ్య రైతులకు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని రైతులకు వాస్తవంగా ప్రయోజనం చేకూరేలా సబ్సిడీని పెంచాలని కోరారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడికి వినతిపత్రం సమర్పించారు. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎర్రి స్వామి, మండల సమన్వయకర్త మూలగిరిపల్లి ఓబన్న, వైసీపీ నాయకులు బసవరాజు, జోగి వెంకటేష్, వేమన్న, పరమేష్, సురేష్, ప్రసాద్, ఓబుళపతి, భూషణం పాల్గొన్నారు.
