ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి : మంత్రి పయ్యావుల కేశవ్
సాగునీటి ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభిస్తాం
ఉరవకొండ, ఆంధ్రప్రభ : ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శనివారం పెద్ద కౌకుంట్ల గ్రామంలో నిర్వహించిన ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులతో ఉరవకొండ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరిందన్నారు. బెలుగుప్ప మండలం సమీపంలోని కనేకల్ ప్రాంతాలను కలుపుకొని సుమారు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 36వ ప్యాకేజీ కింద టెండర్లు పూర్తయ్యాయని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నవంబర్, డిసెంబర్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గడేహోతూరు, చిన్నహోతూరు, పొట్టిపాడు, చాబాల, ధర్మపురి గ్రామాలకు సంబంధించిన 33వ ప్యాకేజీ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని చెప్పారు. రేణుమాకులపల్లి, నింబగల్లు, వ్యాసాపురం ప్రాంతాలకు సంబంధించిన 34వ ప్యాకేజీ పనులను డిసెంబర్ లేదా జనవరిలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
షేక్షానపల్లి–లత్తవరం చెరువు కాలువలో నిలిచిపోయిన, పూడిక పేరుకుపోయిన పనులను పూర్తి చేస్తామని, కొట్టాలపల్లి ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాకెట్ల–ఆమిద్యాల ఎత్తిపోతల పథకానికి బదులుగా రాకెట్ల సుంకాలమ్మ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన వెంటనే సంప్రదింపులు ప్రారంభించాలని నాయకులకు సూచించారు. రిజర్వేషన్లు ఎలా వచ్చినా అభ్యర్థుల ఎంపిక విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై మండల నాయకులు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. చిన్నచిన్న మనస్పర్థలను పక్కనపెట్టి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ కుటుంబ సభ్యుల సమస్యలను కూడా క్రమంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల్లో నమ్మకం పెరిగినప్పుడే నాయకులు, కార్యకర్తలందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
