ఉప్పల్‌ నల్ల చెరువుకు పూర్వవైభవం.. హైడ్రా కృషితో సరికొత్త రూపు

ఉప్పల్, ఆంధ్రప్రభ: ఒకప్పుడు కబ్జాలతో కుచించుకుపోయిన ఉప్పల్‌ నల్ల చెరువు ఇప్పుడు విశాలంగా దర్శనమిస్తోంది. హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా) ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులతో చెరువు రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. చెత్త, వ్యర్థాలతో దుర్భరంగా మారిన ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి.. నల్ల చెరువుకు పూర్వవైభవం తీసుకువచ్చారు. చెరువులోకి మురికినీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చెరువు నీటి నాణ్యత దెబ్బతినకుండా మురుగునీటి ప్రవాహాలను నియంత్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో నల్ల చెరువు స్వచ్ఛమైన నీటి వనరుగా కొనసాగేందుకు మార్గం సుగమం కానుంది. చెరువు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత అదనపు నీరు నిలిచిపోకుండా నేరుగా మూసీ నదిలోకి వెళ్లేలా హైడ్రా అధికారులు ప్రత్యేక అవుట్‌లెట్ల నిర్మాణం చేపట్టారు. దీంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో చెరువులో నీటి మట్టం పెరిగినా.. అదనపు నీటిని సురక్షితంగా బయటకు పంపించే అవకాశం ఉంటుంది.

గతంలో కబ్జాల కారణంగా కుచించుకుపోయిన నల్ల చెరువు ఇప్పుడు ఆక్రమణల నుంచి విముక్తి పొంది విస్తీర్ణాన్ని తిరిగి సంతరించుకుంటోంది. చెరువు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సుందరీకరిస్తూ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఉప్పల్‌ ప్రాంతంలో నల్ల చెరువు మరోసారి ప్రధాన నీటి వనరుగా నిలవనుంది. నీటి అవసరాలకు ఉపయోగపడే చెరువుగానే కాకుండా.. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పర్యాటక ప్రాంతంగా కూడా నల్ల చెరువును తీర్చిదిద్దుతున్నారు. సుందరమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం ఉండటంతో.. నవంబర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నల్ల చెరువు అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు మురికినీరు, కబ్జాలతో తన ఉనికిని కోల్పోయిన నల్ల చెరువు.. ఇప్పుడు హైడ్రా కృషితో కొత్త రూపును సంతరించుకుంటోంది.