Upi-Mdr-Charges ఎండీఆర్ వ్యాపారికే Andhra Prabha Top News

Upi-Mdr-Charges ఎండీఆర్ వ్యాపారికే Andhra Prabha Top News

  • క‌స్ట‌మ‌ర్ కు కాదు
  • ప్ర‌తీ రోజూ కేంద్రం నిఘా
  • యూపీఐపై కొత్త ఛార్జీపై క‌స్ట‌మ‌ర్ ఆందోళ‌న‌
  • వ్యాపారి లావాదేవీల‌పైనే 0.4% MDR
  • అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి..

( న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి):

తాగినోడే తాటి ప‌న్ను క‌ట్టాల‌నే రీతిలో.. త్వ‌ర‌లో కేంద్రం వ‌సూలు చేసే ఎండీఆర్ ను క‌స్ట‌మ‌ర్ల నెత్తిన ప‌డే ప్ర‌మాదంపై ఆందోళ‌న నెల‌కొన్న త‌రుణంలో… వ్యాపారి లావాదేవీల‌ను నిత్యం ప‌ర్యవేక్షించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ఱ‌యం తీసుకుంది. వ్యాపారి గ‌ల్లా పెట్టెలోని ఎండీఆర్ ను.. ఖాతాదారుడి అకౌంటు నుంచి వ్యాపారి వ‌సూలు చేయ‌కుండా బారికేడ్ ల‌ను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి ఊతమిచ్చిన యూపీఐపై కొత్త ఛార్జీల విధానం అమల్లోకి రానుంది. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై అక్టోబరు 15 నుంచి 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) వసూలు చేయనున్న నేపథ్యంలో.. వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేస్తున్నారా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టనుంది.

ప్ర‌తీ రోజూ నిఘా

అక్టోబరు 15 నుంచి ప్రతిరోజూ పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వ్యాపారులు వినియోగదారుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారా? అన్నదానిని గత ఏడాది ఇదే కాలం గణాంకాలతో పోల్చి చూస్తామని వెల్లడించారు.

వ్యాపారులకు అవగాహన

కొత్త MDR విధానం ఎలా పనిచేస్తుంది? ఏ లావాదేవీలకు వర్తిస్తుంది? ఏ వాటికి వర్తించదు? అన్న అంశాలపై వ్యాపారులకు స్పష్టత కల్పించేందుకు ప్రభుత్వం పేమెంట్‌ అగ్రిగేటర్లతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.
షాపు యజమానులు, ఇతర వ్యాపారులకు కొత్త ఛార్జీల విధానాన్ని వివరించి.. అనవసర గందరగోళం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇదే సమయంలో రూ.2,000లోపు యూపీఐ లావాదేవీలకు ప్రస్తుతం అమలవుతున్న 0.15 శాతం వరకు ప్రోత్సాహక పథకం కూడా అక్టోబరు 15 తర్వాత నిలిచిపోనుంది.

యూపీఐపై ఎంత ఛార్జీ?

ఇటీవల నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐ లావాదేవీలపై సవరించిన MDR విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రూ.2,000కు మించిన లావాదేవీలపై 0.4 శాతం MDR విధిస్తారు. ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా రూ.300కే పరిమితం చేస్తారు. అయితే అన్ని లావాదేవీలకు ఒకే రేటు ఉండదు. కొన్ని నిర్దిష్ట వస్తువులు, సేవలకు యూపీఐ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో చెల్లించినా ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ మాత్రమే ఉంటుంది. కొన్ని క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలకు కేవలం 0.02 శాతం రుసుము వర్తిస్తుంది.మరోవైపు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఎస్‌ఐపీ పెట్టుబడులు వంటి పునరావృత యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీ ఉండదు.

వ్యాపారికే!

ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. MDRను వినియోగదారుడు చెల్లించాల్సిన అవసరం లేదు. యూపీఐ ద్వారా వినియోగదారు షాపు లేదా వ్యాపార సంస్థకు చెల్లించే ‘పర్సన్‌ టు మర్చంట్‌’ లావాదేవీలపైనే ఈ ఛార్జీ వర్తిస్తుంది.ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పర్సన్‌ టు పర్సన్‌ (P2P) నగదు బదిలీలకు ఎలాంటి MDR ఉండదు.
వ్యాపారులపై పడే అదనపు వ్యయాన్ని వినియోగదారులపైకి బదిలీ చేస్తారన్న ఆందోళనలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి.

24 వేల కోట్లలో.. కొద్దికే ఛార్జీ!

2025–26లో దేశంలో జరిగిన యూపీఐ లావాదేవీలు 24,000 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఇందులో సుమారు 30 శాతం మాత్రమే వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగిన లావాదేవీలు. ఇక ఆ పర్సన్‌ టు మర్చంట్‌ లావాదేవీల్లోనూ కేవలం 4 శాతం మాత్రమే రూ.2,000కు మించి ఉన్నాయి. అంటే మొత్తం యూపీఐ లావాదేవీలతో పోలిస్తే.. MDR పరిధిలోకి వచ్చే లావాదేవీల వాటా చాలా తక్కువగా ఉండనుంది.

యూపీఐ నిర్వహణకు రూ.20 వేల కోట్లు!

యూపీఐ వ్యవస్థను నిర్వహించేందుకు ఏడాదికి సుమారు రూ.20,000 కోట్ల వ్యయం అవుతున్నట్లు అంచనాలు ఉన్నాయి. కొత్త MDR విధానం ద్వారా ఏడాదికి సుమారు రూ.15,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఈ మొత్తాన్ని బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, థర్డ్‌ పార్టీ యాప్‌ల మధ్య పంచనున్నారు. యూపీఐని పూర్తిగా సబ్సిడీలతో నడిపించడం వల్ల కొత్త ఆవిష్కరణలకు పరిమితులు ఏర్పడతాయని ప్రభుత్వం వాదిస్తోంది.
‘సబ్సిడీలతో ఒక వ్యవస్థను కొనసాగించవచ్చు. కానీ అది ఆవిష్కరణలకు హామీ ఇవ్వదు’’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ధరలు పెరుగుతాయా?

MDR విధానం ప్రకటించడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదనపు ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తామని కొందరు వ్యాపారులు చెబుతుండగా.. మరికొందరు యూపీఐకి బదులుగా నగదు చెల్లింపులను ప్రోత్సహించే అవకాశం ఉందని అంటున్నారు.దీంతో వస్తువులు, సేవల ధరలు పెరగవచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. యూపీఐ ఆధారంగా వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాతే MDR అసలు ప్రభావం ఎంత ఉంటుందో తెలుస్తుందని మరో ఉన్నతాధికారి పేర్కొన్నారు. అక్టోబరు 15 తర్వాత యూపీఐ లావాదేవీలు తగ్గుతాయన్న అంచనాలు తమకు లేవని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక అసలు పరీక్ష అక్టోబరు 15 నుంచే.. వ్యాపారి చెల్లించే MDR వినియోగదారుడి జేబుకు చేరుతుందా? లేక యూపీఐ వ్యవస్థలోనే ఆ భారం కలిసిపోతుందా? అన్నది కేంద్రం రోజువారీ పర్యవేక్షణలో తేలనుంది.