UPI Latest News |దేశవ్యాప్తంగా నిరసన.. రిటైలర్ల సంచలన నిర్ణయం!

–అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా కార్యక్రమం
-యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను నల్ల వస్త్రంతో కప్పివేత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదించిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని అఖిల భారత మొబైల్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఆర్‌ఏ) నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 2న ‘యూపీఐ రహిత దినోత్సవం’ పాటించాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లు తమ దుకాణాల్లోని యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను నల్ల వస్త్రంతో కప్పి నిరసన తెలియజేయనున్నట్లు ఏఐఎంఆర్‌ఏ ప్రకటించింది.

చిన్న వ్యాపారాలపై భారం..

ప్రతిపాదిత 0.4 శాతం ఎండీఆర్‌ ఛార్జీల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, చిన్న దుకాణదారులు, స్వతంత్ర రిటైలర్లపై అదనపు ఆర్థిక భారం పడుతుందని సంఘం పేర్కొంది. ఇప్పటికే తక్కువ లాభాల మార్జిన్‌తో వ్యాపారం నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులకు డిజిటల్‌ చెల్లింపులపై ఛార్జీలు పెరగడం ఇబ్బందికరంగా మారుతుందని తెలిపింది.

డిజిటల్‌ చెల్లింపులకు మద్దతు..

డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని రిటైలర్లు స్వాగతిస్తున్నారని ఏఐఎంఆర్‌ఏ తెలిపింది. అయితే వ్యాపారులకు అందుబాటులో ఉన్న చెల్లింపు విధానాలపై అదనపు ఛార్జీలు విధించే అంశాన్ని విధాన రూపకర్తలు, ఆర్థిక సంస్థలు, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునఃపరిశీలించాలని కోరింది. చిన్న వ్యాపారాలకు డిజిటల్‌ చెల్లింపులు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, లావాదేవీల ఛార్జీలపై ఉన్న ఆందోళనలను ప్రజల దృష్టికి తీసుకురావడమే ఈ నిరసన లక్ష్యమని సంఘం వెల్లడించింది.
‘ఒకే దేశం.. ఒకే వాణిజ్య సౌభ్రాతృత్వం.. ఒకే స్వరం’ నినాదంతో ప్రతిపాదిత 0.4 శాతం ఎండీఆర్‌ను ఉపసంహరించుకోవాలని ఏఐఎంఆర్‌ఏ డిమాండ్‌ చేసింది.