హమాలీకి ఐక్య వ్యాపార సంఘం అండ
వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందజేత
లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద హమాలీ కార్మికుడికి లక్షెట్టిపేట ఐక్య వ్యాపార సంఘం ఆర్థిక చేయూతనందించి మానవత్వాన్ని చాటుకుంది.
ఆపదలో ఉన్న తమ తోటి కార్మికుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఐక్య వ్యాపార సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం రూ.31,500 సేకరించి వైద్య చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు. లక్షెట్టిపేట పట్టణం బీట్ బజార్‌లో హమాలీగా పనిచేస్తున్న తీర్థల కమలాకర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయనది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఐక్య వ్యాపార సంఘం సభ్యులు స్పందించి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల మహేందర్, ఊట్కూర్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్, వ్యాపారస్తులు పల్లెర్ల శ్రీనివాస్, పల్లెర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
