చిట్యాలలో ఈ నెల 9న మెగా జాబ్‌మేళా

  • నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఎంపీడీవో జయశ్రీ

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న భూపాలపల్లిలోని పుష్ప గ్రాండ్‌లో నియోజకవర్గ స్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జయశ్రీ తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువతను పెద్ద సంఖ్యలో జాబ్‌మేళాకు నమోదు చేయించే అంశంపై శనివారం ఎంపీడీవో కార్యాలయంలో మండల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో జయశ్రీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్‌ వసంతరావు, చిట్యాల ఎస్‌ఐ పోచంపల్లి సతీష్‌, ఏపీఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులు తమ పరిధిలోని నిరుద్యోగ యువతను గుర్తించి, ఒక్కొక్కరినీ జాబ్‌మేళాకు నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో వీఓఏల సహకారంతో ప్రతి ఇంటినీ సంప్రదించి నిరుద్యోగ యువత వివరాలను సేకరించాలని ఆదేశించారు.

వీఓఏలు ఎస్‌హెచ్‌జీ సభ్యుల సహకారంతో అర్హులైన యువతను గుర్తించి జాబ్‌మేళాకు నమోదు చేయించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువతీ, యువకుడిని ఈ అవకాశానికి అనుసంధానం చేయాలని తెలిపారు. నమోదు చేసిన అభ్యర్థుల వివరాలను గ్రామాల వారీగా నమోదు చేసి ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని ఎంపీడీవో ఆదేశించారు.

జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడంతో పాటు వాహనాల ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తామని జయశ్రీ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, వీఓఏలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.