వెజిటేరియన్ పిజ్జా ఆర్డర్ చేస్తే రెస్టారెంట్ వారు నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేశారని..రెస్టారెంట్ యాజమాన్యం నుంచి రూ.1 కోటి నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ కేసు వేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన దీపాలి త్యాగి 2019, మార్చి 21వ తేదీన హోలీ పండుగ అనంతరం వెజిటేరియన్ పిజ్జాను ఆర్డర్ చేసింది. సమీపంలో ఉన్న ఓ అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ వారు వెజ్ పిజ్జాకు బదులుగా నాన్ వెజ్ పిజ్జాను ఆమెకు డెలివరీ చేశారు. అయితే అది నాన్ వెజ్ పిజ్జా అని ఆమెకు తెలియదు. దీంతో ఆమె నోట్లో పెట్టుకోగానే అది నాన్ వెజ్ పిజ్జా అని తెలిసి వెంటనే తీవ్రమైన షాక్‌కు గురైంది. ఈ క్రమంలో సదరు రెస్టారెంట్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేసింది.
కాగా తమది సాంప్రదాయ కుటుంబమని, తమ మత విశ్వాసాల ప్రకారం నాన్ వెజ్‌కు దూరంగా ఉంటామని, కేవలం వెజిటేరియన్ ఆహారాలను మాత్రమే తింటామని ఆమె చెబుతూ తనకు వెజ్‌కు బదులుగా నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేసినందుకు ఆ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తనకు రూ.1 కోటి మేర నష్ట పరిహారం అందించాలని కోరుతూ.. ఆమె వినియోగదారుల ఫోరంలో కేసు వేసింది.
అయితే ఆ రెస్టారెంట్ వారు ఆమెకు, ఆమె కుటుంబానికి ప్రతి ఒక్కరికీ ఒక్కో పిజ్జాను ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయినా ఆమె వినలేదు. ఆ రెస్టారెంట్ వారు చేసిన పని వల్ల తమ సాంప్రదాయలు, విశ్వాసాలకు భంగం కలిగిందని, ఇది ఒక్క రోజుతో మరిచిపోయేది కాదని చెబుతూ ఆమె తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఫోరం ఈ విషయంపై సమాధానం చెప్పాలని ఆ రెస్టారెంట్‌కు నోటీసులు ఇచ్చింది. కేసు విచారణను మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది.