పలు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఇప్పటికీ ఆచారాల పేరిట హింసించడం జరుగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా అక్కడి ప్రజలు మాత్రం తమ కట్టుబాట్లు తమవే అంటూ గిరి గీసుకుని మరీ బతికేస్తున్నారు. గుజరాత్లోని హర్జి ప్రాంతంలో జరిగిన సంఘటన చూస్తే నిజమేననిపిస్తోంది. ప్రియుడితో పారిపోయిందనే ఆగ్రహంతో మహిళ జుట్టుకత్తిరించి, ముఖానికి నల్లరంగు పూశారు. ఈ దారుణ ఘటనను కొందరు వీడియోలో రికార్డు చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరలవుతోంది.
వది తెగకు చెందిన గిరిజనులు తమ కట్టుబాట్లను మహిళ ఉల్లంఘించిందనే ఆగ్రహంతో ఈ దాడికి తెగబడ్డారు. తనను విడిచిపెట్టాలని మహిళ.. గ్రామస్తులను వేడుకున్నా వారు కనికరించలేదు.ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా పురుషులు ఆమె ముఖంపై నల్ల ఇంకు చల్లారు. మహిళ చేసిన పనితో తమ తెగకు చెడ్డపేరు వచ్చిందనే కోపంతో ఆమెను శిక్షించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు. పటాన్ ఎస్పీ సుప్రీత్ సింగ్ గులాటీ ఘటనా స్ధలానికి చేరుకుని 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీడియోలో కనిపించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని ఎస్పీ గులాటీ తెలిపారు.