Tuesday, December 24, 2024

AP | విజయ సాయి నోరు అదుపులో పెట్టుకో : మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : నీతి నిజాయితీకి మారుపేరుగా ఉంటూ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి నీకు లేదంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విట్టర్లో నీవు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్మాదత్వానికి ప్రత్యేకంగా నిలుస్తున్నాయని, తప్పు ఎత్తి చూపిస్తే కులం పేరు అంట కడతావా అంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం రగిలించిన కాకినాడ రేషన్ బియ్యం వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే విజయ సాయి రెడ్డి చూస్తున్నారని, అసభ్యకర పోస్టులు పెడుతున్న విజయ్ సాయి రెడ్డి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటూ ఆయన ప్రకటించారు.

విజయ్ సాయి రెడ్డి పై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ పోలీసు కమీషనర్ ను ఆదివారం బుద్దా వెంకన్న కలసి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో బుద్దా వెంకన్న మాట్లాడుతూ అంటే నువ్వు బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే.. భయపడిపోతారా అని ఎదురు దాడి చేశారు.

కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా, ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరు అమ్మరు.. కేవీ రావు గారి దగ్గర మీరు ఎలా తీసుకున్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని, ఎంతోమంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారని గుర్తు చేశారు.

కెవి రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కులాన్ని అంటగడతావా అన్నారు. జగన్ తప్పు చేయలేదని, లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. మీ తప్పులు, పాపాలను ఎత్తి చూపితే.. కులం పేరుతో కుట్రలు చేస్తారా అని అన్నారు.

- Advertisement -

మీ ప్రభుత్వం వస్తే… లోపలేస్తాం అని అంటే.. చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నీలాంటోడిని ఏమాత్రం ఉపేక్షించకూడదు.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలన్నారు.

కాకినాడ పోర్టు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని, జగన్, వైసీపీ నాయకులపై బాధితులే ముందుక వచ్చి కేసులు పెడుతున్నారన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే సహించలేక.. నోరు పారేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు పై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తాను న్యాయస్థానానికి వెళ్లి అయినా పోరాటం చేస్తా అని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement