ఇప్పటికే మహిళల విద్య.. వినోదం..బార్బర్ షాపులతో పాటు క్రీడలపై కూడా పలు ఆంక్షలు విధించారు తాలిబన్లు..రోజు రోజుకి వారి ఆగడాలు శృతిమించుతున్నాయి. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు రాజ్యమేలుతున్నారు. కాగా ఇప్పుడు మరో నిషేధాన్ని విధించారు. విదేశీ కరెన్సీవాడితే కఠిన శిక్ష తప్పదని సూచించారు. వీరు పెడుతోన్న ఆంక్షలతో ఆఫ్ఘన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లకి గురవుతున్నారు. ఆఫ్ఘన్‌లో వ్యాపారం కోసం విదేశీ కరెన్సీ వాడే వారిని శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ప్రకటించారు.ఇప్పటికే ఆఫ్ఘన్ జాతీయ కరెన్సీ విలువ దారుణంగా పతనమైన నేపథ్యంలో తాలిబన్లు తీసుకుంటోన్న అనాలోచిత నిర్ణయాలు ప్రజలను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.
మరోపక్క, ఆ దేశంలో విదేశీమారక నిలువలు కూడా అడుగంటిపోయాయి. బ్యాంకుల్లో నగదు సైతం క్రమంగా తగ్గుతోంది. అలాగే, ప్రపంచ దేశాలు ఆఫ్ఘన్‌లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు. ఆప్ఘనిస్థాన్‌లో చాలా వరకు అమెరికా డాలర్ల రూపంలో వాణిజ్యం నడుస్తుండగా ఇప్పుడు దాన్ని నిషేధించారు. రాను రాను ఆఫ్ఘన్ లో పరిస్థితులు చేజారుతున్నాయి. మరి తాలిబన్ల ఆగడాలకి అడ్డుకట్ట ఎప్పుడనేది ప్రశ్నగా మారింది.