Friday, November 22, 2024

Olympics | 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు ఇండియా రెడీ.. బిడ్‌ వేస్తామ‌న్న కేంద్ర క్రీడా మంత్రి

ఒలింపిక్స్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌కు సంబంధించి భారత్‌ బిడ్‌ వేస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. జీ-20 పగ్గాలు చేపట్టిన భారత్‌కు ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా తెలుసునని ఆయన చెప్పారు. తయారీ, ఇతర రంగాలలో దూసుకుపోతున్న భారత్‌.. క్రీడలలో మాత్రం వెనుకబడి ఉండాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు. అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌కు ఇటీవలే జీ-20 సారథ్యం దక్కింది. దీనిని భారత్‌ విజయవంతంగా నిర్వహించగలిగినప్పుడు ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా కష్టమేమీ కాదు. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ)తో కలిసి ఆ దిశగా కృషి చేస్తాం..

2032 వరకూ ఒలింపిక్స్‌ వేదికలు ఖరారై ఉన్నాయన్న విషయం మాకు తెలుసు. అయితే 2036 ఒలింపిక్స్‌ కోసం ఇండియా కచ్చితంగా బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొంటుందని నేను అనుకుంటున్నా. అసలు ‘నో’ అని చెప్పడానికి కూడా అవకాశమే లేదు. భారత్‌లో కొంతకాలంగా క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. ఒలింపిక్స్‌ నిర్వహణను ఘనంగా చేపడతామనే నమ్మకముంది. తయారీ, సేవలు వంటి రంగాలలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రతీ రంగంలోనూ భారత్‌ పేరు మార్మోగి పోతున్నప్పుడు క్రీడల్లో మాత్రం ఎందుకు వెనుకబడాలి? 2036 ఒలింపిక్స్‌ బిడ్‌ కోసం ఇండియా తీవ్రంగా కృషి చేస్తోంది’ అని తెలిపారు. ఒలింపిక్స్‌ నిర్వహణకు గుజరాత్‌ అనుకూలమని అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement