పాయకాపురం, (ఆంధ్ర ప్రభ) : పట్టిసీమ కాలువ వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి సమీపంలోని పోలవరం పట్టిసీమ కాలువ వద్ద ఆరుగురు యువకులు స్నానానికి వెళ్లగా… ఇద్దరు గల్లంతయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం….
సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు జక్కంపూడి కాలువ వద్ద స్నానానికి వెళ్లగా నలుగురు యువకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన యువకులను తేజ (18), మున్వర్ (18)గా గుర్తించారు.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ కొత్తపేట పోలీసులు, 108 సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, పొద్దుపోవటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు వెతకడం నిలిపివేశారు. గల్లంతైన యువకుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.