హైదరాబాద్ – ఎంత విషం చిమ్మినా కాళేశ్వరం తెలంగాణ దాహం తీరుస్తోందని అన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . మల్లన్నసాగర్ వద్దని నిరాహార దీక్షలు మీరు చేసినా నేడు మహానగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్న సాగర్ అని కేటీఆర్ అన్నారు. కాళేశ్వర నుంచి గోదావరి జలాలను మల్లన్న సాగర్ కు తీసుకువచ్చి హైదరాబాద్ కు తాగు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో కెటిఆర్ ట్విట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ప్రచారం చేసినా తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు అని, ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పారు. లక్షకోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశారు. అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించినా.. నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
అక్షరం మార్పుకు వెయ్యి కోట్లు ఖర్చు …
కేటీఆర్ మరో ట్వీట్ లో.. ‘‘రైతు భరోసా ఇవ్వలేదు.. రుణమాఫీ సక్కగా చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు.. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు. కానీ, ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేలకోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు అక్షరం మార్పుకోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు! నాలుగు కోట్ల గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు.’’ అంటూ కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కార్ టిఎస్ నుంచి టిజిగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి వెయ్యి కోట్లు ఖర్చు అయిందన్న నేపథ్యంలో కెటిఆర్ ఈ ట్విట్ చేశారు.