Sunday, December 22, 2024

Twit – రైతుల‌కు పంగ‌నామాలు పెట్టినందుకా విజ‌యోత్స‌వాలు – కాంగ్రెస్ సర్కార్ పాలనపై కెటిఆర్ ఆగ్రహం

ప్ర‌జాపాల‌న ఉత్స‌వాల‌పై కెటిఆర్ ఆగ్ర‌హం
సిగ్గు లేదా జీడిగింజా అంటే..
నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట అనేచందంగా కాంగ్రెస్ పాల‌న‌
ఒక వైపు రైతుల భ‌రోసాకు టోక‌రా
మ‌రో వైపు దిలావ‌ర్ పూర్ లో ద‌మ‌న‌కాండ‌
రామ‌న్న‌పేట‌లో రావ‌ణ‌కాష్టం
ఇక ల‌గ‌చ‌ర్ల‌లో అల్లుడి కోసం గిరిజ‌నుల జైళ్ల పాలు
అబద్దానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్
ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ స‌ర్కార్ కు కెటిఆర్ చుర‌క‌లు

హైదరాబాద్‌: విజయోత్సవాలు దేనికి చేస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ప్రశ్నించారు. సిగ్గు లేదా జీడిగింజా అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట అనేచందంగా కాంగ్రెస్‌ సర్కార్‌ తీరు ఉందని ఫైరయ్యారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టారని, పంటల కొనుగోళ్లకు శఠగోపం పెట్టి, ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. దిలావర్‌పూర్‌లో దమనకాండ సృష్టించి, రామన్నపేటను రావణకాష్టం చేసి లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్లలో ఆనందం చూసినందుకా అని నిలదీశారు. అబద్దానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఎక్స్‌ వేదికగా విమర్శించారు.

‘సిగ్గు లేదా జీడిగింజా అంటే-నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట!
రైతుభరోసాకు ఎగనామం పెట్టి-రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి
పంటల కొనుగోళ్లకు శఠగోపం పెట్టి-ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టి
దిలావర్ పూర్ లో దమనకాండ సృష్టించి-రామన్నపేటను రావణకాష్టం చేసి-లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్ళలో ఆనందం చూసినందుకా?
రైతు పండుగలా ?
పండుగలు మీకు-పస్తులు రైతులకు
చెప్పింది బారాణ-చేసింది చారాణ
కల్లాల్లో ధాన్యం పోసి
కళ్లల్లో వత్తులు వేసుకొని
కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు
నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో
అడ్డికి పావుశేరు లెక్కన దళారులకు అమ్ముకుంటున్నారు
అబద్దానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్
దేనికి విజయోత్సవాలు ?
రైతును నిండా ముంచినందుకా ?
వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా ?
నీ గుడ్డిగుర్తులు, కాకిలెక్కలు, కల్లబొల్లి కబుర్లతో ఎల్లకాలం కాలం వెళ్లదీయలేవు
జాగో తెలంగాణ జాగో’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement