Monday, November 18, 2024

దుందుబీ కాజ్వేపై ప్ర‌యాణం ప్రమాదక‌రం .. హెచ్చ‌రిక చేయ‌ని అధికారులు

ఉప్పునుంతల, (ప్రభన్యూస్) : ప్రమాదం అంచున దుందుబీ నది కాజ్వే పై ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పునుంతల, వంగూరు మండలాలలోని దుందుభి నదిపై గల మొల్గర కాజ్వేపై నిరంతరం ప్రవహిస్తున్న నీటి కారణంగా సీసీ కాజ్వే పాకరబట్టి నిత్యం వాహనాలు జారి పడుతూ వాహన దారులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు కనీసం హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేకపోయారని స్థానిక ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. కల్వకుర్తి‌‌‌‌, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి అనువైన దగ్గరి రహదారిగా ప్రజలు అనునిత్యం ఈ దారి వెంబడి రాకపోకలు సాగిస్తున్నారు. కానీ అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న కాజ్వేను పదేళ్ళ నుండి పట్టించుకోకుండా వదిలేయడమే కాక కనీసం నీరు ప్రవహిస్తున్నప్పుడు తాత్కాలిక మరమ్మతులకు కూడా నోచుకోలేని స్థితిలో కాజ్వే ఉందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నిసార్లు విన్నవించి మొరపెట్టుకున్నా అటువైపుగా ఆలోచించని ప్రజాప్రతినిధులు అధికారులు ఈ రహదారి వెంబడి నిత్యం ప్రయాణిస్తే తప్ప వారికి ఇక్కడ జరుగుతున్న ప్రమాదాల విలువ తెలిసిరాదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడి ప్రజలకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కల కలగానే మిగిలిపోతుందేమోనన్న భయం ప్రతి ఒక్కరి మనసులో ఉన్నా కనీసం వరద ప్రవాహానికి గుణలు వేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దుందుభి నది పొంగినప్పుడే రాకపోకలు నిలిచిపోయేవని కాని ప్రస్తుతం నిరంతరం నీటి ప్రవాహం వల్ల ఎడతెరిపి లేకుండా నిరంతరం కురుస్తున్న వర్షపు నీటి ప్రవాహంతో సీసీ కాజ్వే పాకారబట్టి ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజు సుమారుగా పది మందికి పైగానే జారి పడి ప్రమాదాలకు గురి కావడమే కాక తమ విలువైన వస్తువులను పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని కనీసం కాజ్వే నుండి ప్రవహించే నీటిని గూనలు ఏర్పాటు చేసి నీటిని మళ్లించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు.


పరిశీలన ప్రతిపాదనలేనా.. మరి పనులెప్పుడు..?
పరిశీలన ప్రతిపాదనలకేనా మరి పనులు ఎప్పుడు చేస్తారని స్థానిక ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. గత జూన్ 29న ఉమ్మడి జిల్లా ఆర్అండ్ బీ ఎస్ఈ (రోడ్ల భవనాల శాఖ) అధికారి నరసింహ దుందుభి నది కాజ్వే పరిస్థితిని పరిశీలించారు. సైడ్ డ్రైన్ వాల్ పూర్తిగా కుంగి దెబ్బతినడం వల్ల ప్రస్తుతం కేటాయించిన 30 లక్షల నిధులు సరిపోవని డీఈ నాగలక్ష్మికి ఆయన సూచించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి ప్రవాహంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చొరవ తీసుకుని పనులను త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
చాలా మంది ప్రతిరోజు జారిపడుతుండ్రు (మాడ్గుల రమేష్, మొల్గర గ్రామస్థుడు) :
దుందుభి నది కాజ్వేపై జరుగుతున్న ప్రమాదాలను ప్రతి రోజూ చూస్తున్నా పాకర బట్టిన సీసీ రోడ్డుపై పడి దెబ్బలు తగిలిచ్చికొని రోధిస్తున్న వాళ్ళు చాలానే ఉన్నారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలు పడ్డప్పుడు పాపం బాధగా ఉంది. అధికారులైనా ప్రజాప్రతినిధులైన ఎవరైనా త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement