Monday, November 25, 2024

TG – కుటుంబ స‌భ్యుల కోస‌మే రేవంత్ పాల‌న‌ – మ‌హ‌బూబాబాద్ మహా ధర్నాలో కెటిఆర్

ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయని సీఎం
బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు
మ‌హ‌బూబాబాద్ ధ‌ర్నాలో ప్ర‌సంగం
కొత్త నియంత‌కు బుద్ధిచెప్పేందుకు మానుకోట సిద్ధ‌మైంది
ఫార్మా విలేజ్ ఎవ‌రి కోసం?
ల‌గ‌చ‌ర్ల‌కు సీఎం వెళ్లి ఉంటే ఉరికించి కొట్టేవారు.. అది రైతుల ప‌వ‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ , మ‌హ‌బూబాబాద్ రూరల్ : లగచర్లలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. వారి భూములను తీసుకుంటామని చెబుతే మా ఆడబిడ్డలు 9 నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారని అన్నారు. 9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదని విమర్శించారు. . గిరిజన, దళిత, పేద రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ ముఖ్య‌మంత్రికి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు.. కనీసం 28 పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారని అన్నారు. ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోదీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారని గుర్తుచేశారు. రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుందని.. అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నార‌ని మండిపడ్డారు.

- Advertisement -

ఫార్మా విలేజ్‌ ఎవరి కోసమని కేటీఆర్‌ ప్రశ్నించారు. తన అల్లుడి కోసం రేవంత్‌ రెడ్డి పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నార‌ని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి తన సొంత అల్లుడు, అదానీ, అన్న తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పని చేయడం లేదని విమర్శించారు. మరో 10 రోజులైతే రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది అవుతుందని గుర్తుచేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చారా? ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఇక్కడున్న డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదే మానుకోట 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందని అన్నారు. మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధిచెప్పేందుకు సిద్ధమైందని తెలిపారుఅసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు కరెంట్ టైమ్ వస్తుండే అని కేటీఆర్‌ తెలిపారు. అదే రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొట్టిండని.. పింఛన్ పెంచలేదని.. బోనస్ బోగస్ అయ్యిందని తెలిపారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీం రాలేదని అన్నారు. . మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారని తెలిపారు.

తాను ఇక్కడకు వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామని అంటున్నారని కేటీఆర్ తెలిపారు. తాను డీజీపీ, ఎస్సీ గారిని అడుగుతున్నా.. రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా? అని నిలదీశారు.

త‌మ‌ గిరిజన రైతుల కోసం కదులుతూ మానుకోటలో ధర్నా చేస్తామంటే లగచర్లలో జరిగిన సంఘటనకు మానుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ ప్రశ్నించారని తెలిపారు. కొడంగల్ రైతుల కోసం ఒక్క మానుకోటలోనే కాదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. సన్నకారు, బక్క చిక్కిన రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుందని స్పష్టం చేశారు. .రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే దాకా వదిలిపెట్టమని చెప్పారు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే, పెట్రోల్ పోస్తామంటే భయపడమని కేటీఆర్‌ అన్నారు. తాము కేసీఆర్ తయారు చేసిన దళమ‌ని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మానుకోట రాళ్ల మహత్మ్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్లందరికీ తెలుసని అన్నారు. మానుకోటలో 14 ఏళ్ల క్రితమే నిప్పు పుట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చిందని అన్నారు. ఇవాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నామని అన్నారు. ఈ మహా ధర్నాకు వెయ్యి మంది అనుకుంటే 25 వేల మంది వచ్చారని అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో ఈ మానుకోట మహాధర్నా చూస్తే అర్థమవుతోందని అన్నారు.

ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు, మధుసూదన్ చారి, ఎమ్మెల్యేలు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి,ఎంపీ వద్దు రాజు రవిచంద్ర.మాజీ ఎమ్మెల్యేలు డి ఎస్ రెడ్యా నాయక్,బానోతు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బానోతు హరిప్రియ, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్. బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మానుకోట మున్సిపాలిటీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి. వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, సొసైటీ చైర్మన్ నాయని రంజిత్, యాళ్ల మురళీధర్ రెడ్డి, పర్కాలశ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement