తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. కోట్లాది మందిని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా సాగింది. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్నారు. 2014 జూన్ 2న దేవంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ఉద్యమ సమయంలో ఎంతో మంది విద్యార్థులు, ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదాలు చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వెరుపడిన సమయంలో తెలంగాణ కలిసేందుకు ఒప్పుకోలేదు. కానీ 58 ఏళ్ల పాటు అణచివేతకు గురైంది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. కానీ తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు.
కాలుకి బలపం కట్టుకొని జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. మే 17వ తేదీన కరీంనగర్‌లో సింహగర్జన సభ నిర్వహించి… రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమని.. తెలంగాణ కోసం ఎలుగెత్తి గొంతెత్తి నినాదించారు.
2001 సెప్టెంబర్‌లో సిద్దిపేట అసెంబ్లీ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. పార్టీ ఆవిర్భవించిన అనతికాలంలోనే ప్రజలు కేసీఆర్‌కు విజయం కట్టిపెట్టారు. తర్వాత 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పెత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ అంశం చేరింది. అప్పటి రాష్ట్రపతి కూడా తెలంగాణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఇక అప్పటినుంచి తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది. 2004 నుంచి ఉద్యమం కొనసాగుతోన్న.. 2009కి మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించడంతో… డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు.
చివరికి ఫిబ్రవరి 13, 2014 లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టగా.. ఆమోదం తెలిపింది. కానీ ఏపీ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత రావడంతో.. తలుపులు వేసి మరీ బిల్లు పాస్ చేయించారు. తర్వాత ఫిబ్రవరి 18, 2014లో లోక్‌సభ ఆమోదం తెలిపిన బిల్లును రాజ్యసభ ఆమోదం ముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం మార్చి 1వ తేదీన ఆమోదం తెలిపారు. మార్చ్ 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రభుత్వ రాజముద్ర ప్రచురించింది. జూన్ 2వ తేదీ 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారామైంది.
తెలంగాణను సాధించిన నేతగా ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ అన్నిరంగాల్లో తెలంగాణ దూసుకెళ్తున్నది. ఇరిగేషన్, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి ఇలా పలు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పరుగులు తీస్తోంది. రైతు బీమా, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఐటీలోనూ మంచి ఫలితాలు రాబడుతూ దేశానికి దిక్సూచిలా మారింది. అటు.. పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది. కాగా, నేడు ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గన్‌పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు.