కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం గరం గరం
‘లడ్కీ బెహన్’ ‘మహిళా సమ్మాన్ యోజన’ ఎవరికోసం
ఉచితాల పేరుతో ప్రజలను పనులకు దూరం చేస్తున్నారు
అభివృద్ధి గాలికొదిలేసి ఫ్రీ పథకాలకే పెద్ద పీట
ఉద్యోగికి జీతాల అడిగితే నిధుల కొరత అంటూ మొండి చేయి
న్యూ ఢిల్లీ – న్యాయమూర్తుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తూ ఉచిత పథకాలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని న్యాయమూర్తులకు చాలీచాలని జీతాలు, పదవీ విరమణ అనంతరం అందుతున్న అరకొర ప్రయోజనాలపై విచారం వ్యక్తం చేస్తూ అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు జరిగిన విచారణ సందర్భంగా జడ్జిలు బీఆర్ గవాయ్, ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఉచితాలకు డబ్బులు ఉంటాయి కానీ జడ్జిల జీతాల చెల్లింపునకు మాత్రం ఉండవా?’’ అని నిలదీసింది.
ఇటీవలి జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రకటించిన ‘లడ్కీ బెహన్’ పథకం, ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ప్రకటించిన ‘మహిళా సమ్మాన్ యోజన’, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆర్థిక హామీలను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.
‘‘జడ్జిలకు జీతాలు చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా ఆర్థిక పరిమితులను సూచిస్తుంటాయి. అయితే, ఎన్నికల సమయంలో మాత్రం ‘లడ్కీ బెహన్’ వంటి ఉచితాలు ప్రకటిస్తుంటారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు మహిళలకు రూ.2,100 లేదా రూ.2,500 చెల్లిస్తామంటూ ఆర్థిక వాగ్దానాలు చేయడం మనం చూశాం’’ అని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగస్తులకు జీతాల ఇచ్చేందుకు నిధులు కొరత అంటున్న ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో ఖజనా సోమ్ములను మంచినీళ్లు ఖర్చు చేస్తున్నాయని న్యాయమూర్తులు మండిపడ్డారు.. అభివృద్దిని గాలికొదిలేసి ఉచితాల పేరుతో ప్రజలను సోమరులుగా చేస్తున్నారంటూ కామెంట్ చేశారు.