నాగర్‌కర్నూలు / హైదరాబాద్, ఆంధ్రప్రభ : వంగనూరు మండలం పాములకుంట్ల కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది.
ఆత్మహత్యకు ముందు సాయిరెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. వెటర్నరీ కళాశాల వెనుక సాయిరెడ్డి ఇల్లు ఉంది. ఇంటికి వెళ్లే మార్గంలో పశువైద్యశాల కంచె గోడ నిర్మించడంతో మనస్తాపానికి గురై కల్వకుర్తికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి సాయిరెడ్డిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు సాయిరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.
రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి : కేటీఆర్ డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుల అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండపల్లి మాజీ సర్పంచ్ పాములకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య ఆత్మహత్య కాదని, సీఎం సోదరులు చేసిన హత్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల సోదరులపై కేసు నమోదు చేయాలని శుక్రవారం కేటీఆర్ డిమాండ్ చేశారు.