యూఎస్‌లో ఉన్నత చదువులు చదువుకోవాలనే విద్యార్థులకు అమెరికా శుభవార్త తెలిపింది. యూఎస్‌లో చదువుకునేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో వీసా స్లాట్లు పెంచేందుకు అగ్రరాజ్యం కసరత్తు చేస్తోంది. అమెరికాలోని పలు యూనివర్సిటీలు ఇప్పటికే ఐ-20 ధ్రువపత్రాల జారీని వేగవంతం చేశాయి. ఢిల్లిలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతాలోని కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా స్లాట్లు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థుల వీసాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో కొన్ని ఆంక్షలను కూడా అమలుచేయనున్నారు. ఒక సీజనులో ఒకసారి మాత్రమే విద్యార్థికి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేలా అవకాశం కల్పించనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. కాగా ఒకసారి వీసా తిరస్కరణకు గురైన తర్వాత కొద్ది రోజుల అనంతరం అదే కాన్సులేట్ లేదా ఇతర కార్యాలయాల్లో ఇంటర్య్వూ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ విధానం వల్ల విద్యార్థులు ఇంటర్వ్యూ స్లాట్లు లభించక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు విమర్శలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలో ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు వీసా స్లాట్లను కనీసం 30శాతం అదనంగా కేటాయించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తుందని ఉన్నతస్థాయి అధికారవర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో వీసా స్లాట్ల సంఖ్య గణనీయంగా తగ్గించారు.
తాజాగా పరిస్థితి మెరుగవడంతో స్లాట్లను వెయ్యికిపైగా పెంచే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం పర్యాటక బీ1, బీ2 వీసాలు జారీ చేయడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బీ1, బీ2 వీసాలు యూఎస్ ఎంబసీ జారీ చేయనుందని సమాచారం. ఈ సందర్భంగా ఢిల్లిలోని యూఎస్ రాయబార కార్యాలయ అధికారులు మాట్లాడుతూ గతేడాది అంతకుముందెన్నడూ లేని రీతిలో గణనీయంగా భారత్‌లో విద్యార్థులకు అమెరికాలో చదువుకునేందుకు వీసాలు జారీ చేసినట్లు తెలిపారు. గతేడాది మొత్తం 62వేల వీసాలు జారీ చేశామని ఈ ఏడాది ఆ సంఖ్యను అధిగమిస్తామని తెలిపారు. అయితే విద్యార్థుల వీసాకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎంతవరకు సన్నద్ధతగా ఉన్నారనేదానిపై వీసాలు జారీ ఉంటుందని తెలిపారు. గతంలో వీసా తీసుకుని గడువుతీరి రెన్యూవల్ చేసుకోవాలనుకునేవారికి ఇంటర్వ్యూ అవసరం లేకుండానే డ్రాప్ బాక్స్ సౌకర్యం కల్పించారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్‌లోని కాన్సులేట్ సేవలందింస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..