Wednesday, December 18, 2024

AP: ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ… గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ సాక్షాత్కారం…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : వేద‌మాత‌గా ప్ర‌సిద్ధి పొందిన త‌ల్లి.. ముక్తా, విద్రుమ‌, హేమ‌, నీల‌, ధ‌వ‌ళ వ‌ర్ణాల‌తో ప్ర‌కాశిస్తూ పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యా వంద‌న అధిష్టాన దేవ‌త అయిన గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్ర‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ విదియ‌) నేడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ గాయ‌త్రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది.

గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలువుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పిస్తారు. గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో ఎదురు చూడడం కనిపించింది. అమ్మ కరుణ కోసం భక్తులు కెనాల్ రోడ్ లోని వినాయకుడి గుడి నుండి క్యూలైన్ల ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. తెల్లవారుజామున స్నప్రాది స్నానాలు అనంతరం అమ్మవారి అలంకరణ ను అత్యంత తేజవంతంగా చేశారు.

ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి దర్శన భాగ్యాన్ని ఉదయం నాలుగు గంటల నుండి భక్తులకు కల్పించారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరవ అంతస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తుల రాక అంచనా నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. కనకదుర్గమ్మకు భక్తితో తలనీలాలు సమర్పించి, కృష్ణానది తీరాన ఏర్పాటు చేసిన జల్లు స్నానాలు ఆచరిస్తున్న భక్తులు అమ్మవారి దర్శనానికి కొండపైకి చేరుకుంటున్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా 13 శాఖల అధికారుల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement