హైదరాబాద్, ఆంధ్రప్రభ: డ్రగ్స్ మాఫీయా పై నిఘా వర్గాలు దృష్టి సారించినా, పోలీసులు దాడులు చేస్తున్నా అనేక విధాలుగా మఫియా డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు విదేశాల నుంచి స్మగ్లర్లు డ్రగ్స్ దేశానికి తరలిస్తూ పట్టుబడే వారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా కొత్త విదానాలను అనుసరిస్తోంది. స్వతహాగా డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేసే స్థాయికి హైదరాబాద్ మాఫీయా రూపాంతరం చెందింది. డ్రగ్స్ తయారుచేసే ల్యాబ్ లు హైదరాబాద్ లోనే ఉన్నాయని ఇటీవల నిఘావర్గాల దాడుల్లో వెలుగుచూసింది. సోమవారం ఈ మాదక ద్రవ్యాల కలకలం హైదరాబాద్ లో మరోసారి చెలరేగింది. రూ.49.77కోట్లు విలువైన 24. 885కిలోల మాదక ద్రవ్యాలను రెవెన్యూ ఆఫ్ ఇంటెలీజెన్సీ ,డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ (మెఫిడ్రిన్) తయారు చేసే రెండు ల్యాబ్ లను సీజ్ చేశారు. ఏడుగురిని అరెస్టు చేశారు. డ్రగ్స్‌కు తయారీకి వినియోగించే ముడిసరుకులు, యంత్రాలను,అక్రమరవాణాకు వాడే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ చేసే స్మగ్లర్ల మూఠా సంచరిస్తున్నట్లు పసికట్టిన నిఘావర్గాలు ఈ నెల 21 నుంచి ప్రత్యేక ఆపరేషన్ చేసి పక్కా ఆధారాలతో దాడీచేసి డ్రగ్స్ స్మగ్లర్ల ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారిని గోరక్ పూర్ లో పట్టుకున్నట్లు డిఆర్ఐ తెలిపింది.
రూ.60 లక్షలతో ప్రధాన నిందితుడు నేపాల్ కు పారిపోతుండగా పక్కా స్కెచ్ తో ఆతన్ని అదుపులోకి కీసుకున్నారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ తోసంబంధం ఉన్న ఏడుగురిలో కొందరిపై గతంలో మాదక ద్రవ్యాల తయారీ కీ సంబంధించిన కేసులు ఉన్నట్లు నిఘావర్గాలు వెల్లడించాయి. అందులో కొందరిపై హైదరాబాద్ లో హత్యా కేసు, వడోదర లో దోపిడీ కేసు,ఇండోర్, యమునానగర్ ఎఫిడ్రిన్ తయారీకేసులతో సంబంధాలున్నట్లు డిఆర్ఐ అధికారులు తెలిపారు.