కీవ్:రష్యాకు చెందిన యువ సైనికుడిని యుద్ధ నేరస్థుడిగా ఉక్రెయిన్ కోర్టు నిర్థారించింది. 62 ఏళ్ల వృద్ధుడిని అకారణంగా, ఉద్దేశపూర్వకంగా కాల్చిచంపిన నేరానికిగాను జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావస్తుండగా ఆ దేశానికి చెందిన తొలి యుద్ధనేరస్థుడిగా 21 ఏళ్ల వదిమ్ షిషిమరిన్ పట్టుబడి శిక్షకు గురైనాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. రష్యా దండయాత్ర ప్రారంభమైన తొలినాళ్లలో ఉక్రెయిన్ రాజధాని కీవ్, పరిసర ప్రాంతాలపై విరుచుకుపడింది. వందలాది యుద్ధ ట్యాంకులతో దాడులకు తెగబడింది. సుమీ ప్రాంతంలో దాడులు చేస్తున్న రష్యా సైనికుల్లోని 21 ఏళ్ల వదిమ్ షిషిమరిన్ ఎదురుగా వెడుతున్న 62 ఏళ్ల ఒలెగ్జాండ్ర్ షెలిపోవ్ తలకు గురిపెట్టి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తరువాత వదిమ్‌ను ఉక్రెయిన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు, వీడియో దృశ్యాలు ఆధారంగా అతడు యుద్ధ నేరానికి పాల్పడ్డట్టు ధ్రువీకరించి న ప్రభుత్వం యుద్ధనేరాభియోగంపై విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. కీవ్‌లో వారం రోజులుగా విచారణ నిర్వహించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెర్జియ్ అగఫోనోవ్ సోమవారం తీర్పునిచ్చారు. యుద్ధనేరానికి పాల్పడినట్లు నిర్ధారించిన న్యాయమూర్తి వదిమ్‌ను దోషిగా పేర్కొంటూ జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.
అయితే తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. విచారణ సందర్భంగా వదిమ్ తన నేరాన్ని అంగీకరిస్తూ మృతుని భార్యకు క్షమాపణలు చెప్పాడు. సహచర సైనికుని ఒత్తిడితో నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. కీవ్‌నుంచి తమ బలగాలు వెనక్కు మళ్లుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 28న దొంగిలించిన ఓ కారులో వెడుతూండగా ఆ వృద్ధుడిని హతమార్చినట్లు వదిమ్ అంగీకరించాడు. కాగా తీర్పు వెలువరిస్తున్నప్పుడు అద్దాల గదిలో ఉన్న వదిమ్ నిర్వికారంగా ఉండిపోయాడు. అతడి తరుపు న్యాయవాది విక్టర్ ఒస్యాన్నికోవ్ తీర్పు సారాంశాన్ని రష్యన్ భాషలో అనువదించి చెప్పారు. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని వెల్లడించారు. కాగా తీర్పు వెలువడకముందు రష్యా స్పందిస్తూ తన సైనికుడి భవితవ్యంపై విచారం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో తమ దౌత్య కార్యాలయాలు లేనందువల్ల అతడికి సహాయపడలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది. అంతమాత్రాన అతడిని అలా వదిలేయబోమని, రక్షించేందుకు ఇతర మార్గాల్లో ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. కాగా తమపై దండయాత్ర ప్రారంభించిన రష్యా దాదాపు పదివేల యుద్ధ నేరాలకు పాల్పడిందని, అమాయక పౌరులను హతమార్చిందని ఉక్రెయిన్ ఆరోపిస్తూండగా క్రెవ్లిున్ ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి యుద్ధనేరస్థుడిపై విచారణ జరిపి జీవితఖైదు విధించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..