Wednesday, December 4, 2024

TG | పెద్దపల్లి జిల్లాకు రేవంత్ వరాల జల్లు…

పెద్దపల్లి ఆంధ్రప్రభ, – పెద్దపల్లిలో నేడు నిర్వహించనున్న యువ వికాసం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ, ముఖ్యమంత్రి రేవంత్ ఆ జిల్లాకు వరాలు కురిపించారు.. పెద్దపల్లికి రూరల్ పోలీసు స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను మంజూరు చేశారు. ఎలిగేడు మండల కేంద్రానికి పోలీసు స్టేషన్, వ్యవసాయ మార్కెట్ను మంజూరు చేశారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. మంథనిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పెద్దపల్లికి 4 వరుసల బైపాస్ రోడ్ మంజూరు చేశారు. అలాగే పెద్దపల్లి బస్సు డిపోను కూడా మంజూర చేసేశారు రేవంత్.

కాసేపట్లో పెద్దపల్లిలో యువజన వికాస విజయోత్సవ సభ

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న యువజన వికాస విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరుకానున్నారు. సభలో 9 వేల మంది నిరుద్యోగులకు నియామకపు పాత్రలు అందించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఏడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ వేదికనుండే సీఎం కప్ పోటీలను ప్రారంభించనున్నారు. బహిరంగ సభ కోసం జిల్లా నేతలు లక్ష మంది జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభాస్థలికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ హర్కార వేణుగోపాల్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సభా స్థలికి చేరుకున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యవేక్షిస్తుండగా, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సిపి శ్రీనివాసులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఉమ్మడి జిల్లా పరిధిలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. 82 కోట్ల రూపాయలతో నిర్మించే పెద్దపల్లి బైపాస్ రోడ్డు, సుల్తానాబాద్‌ బైపాస్‌ రోడ్ల నిర్మాణాలకు. జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్లతో స్వశక్తి మహిళా ప్రాంగణం భవన నిర్మాణానికి, రామగుండం నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులకు, మంథనిలో ఆర్‌అండ్‌బీ పెండింగ్‌ రోడ్ల పూర్తికి, రూ. 10 కోట్లతో అంతర్గాంలో, మంథని గంగపురిలో, పోతారం గ్రామంలో 33/11 కేవీ సబ్‌ స్టషన్ల నిర్మాణ పనులకు, అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో బండ్లవాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల పూర్తికి, జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, రామగుండం మున్సిపాలిటీల పరిధిలో రూ. 51 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

ఓదెల మండలం రూపునారాయణపేట వద్ద మానేరు నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి రూ. 80 కోట్లతో చేపట్టే పనులకు, కాల్వశ్రీరాంపూర్‌ నుంచి మొట్లపల్లి రూ. 25కోట్లతో, పీడబ్ల్యు రోడ్‌ నుంచి ఎల్లంపల్లి వరకు రూ. 7 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు, రూ. 6 కోట్లతో గర్రెపల్లి నుంచి ఎలిగేడు వరకు రహదారి విస్తరణ, రూ. 5 కోట్లతో హుస్సేన్‌ మియా వాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి, రూ. 12 కోట్లతో సుగ్లాంపల్లి నుంచి ధూళికట్ట వరకు రహదారి విస్తరణ పనులకు, రామగుండంలో రూ. 60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు, మంథనిలో బ్రిడ్జి, రోడ్ల నిర్మాణానికి, మంథని ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను ప్రారంభించనున్నారు. 2.45 కోట్ల రూపాయలతో నిర్మించే గుంజపడుగులో 30 పడకల ఆస్పత్రికి, పెద్దపల్లి 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను ప్రారంభించనున్నారు. పెద్దపల్లి రూరల్‌, మహిళా, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లతోపాటు ఎలిగేడులో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించనున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి అన్ని హంగులతో పనులు నిర్వహించేలా శంకుస్థాపన చేయడంతోపాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

9 వేల మందికి నియామక పత్రాలు

యువజన వికాస విజయోత్సవ సభలో 9 వేల మంది నిరుద్యోగులకు నియామకపు పత్రాలు సీఎం అందించనున్నారు. 500 మందికి సింగరేణి ఉద్యోగాల నియామకాలు, గ్రూప్‌- 4, ఇతర ఉద్యోగాలు దాదాపు 8500 మందికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement