Friday, November 22, 2024

భూముల అమ్మకాల్లో స్కాంపై సీబీఐకి ఫిర్యాదు చేసిన రేవంత్

హైదరాబాద్ నగరంలోని కోకాపేట, ఖానామెట్ గ్రామాల్లో ప్రభుత్వం వేలం వేసిన భూములన్నీ మైహోం, వాటి అనుబంధ సంస్థలు, టీఆర్ఎస్‌ నేతలకు అత్యంత సన్నిహితంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కొనుగోలు చేయడంపై రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన తరవాత సీబీఐ డైరక్టర్‌ను నేరుగా కలిసి భూముల అమ్మకాలపై విచారణ జరపాలని వినతి పత్రం ఇచ్చారు. రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగిందన్న ఆధారాలు కూడా ఇచ్చానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

భూముల స్కాంలో ప్రధానంగా మై హోం రామేశ్వరరావుతో పాటుగా సీఎస్‌ సోమేష్ కుమార్‌, సీనియర్ ఐఏఎస్‌లు జయేశ్ రంజన్, అర్వింద్ కుమారులు ఉన్నారని రేవంత్ అంటున్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాజ్‌పుష్ప కంపెనీ పేరుతోనూ తక్కువకు భూములు కొనుగోలు చేశారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా రేవంత్ స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను, రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని సీబీఐకి ఇచ్చిన లేఖలో వివరించారు. ఎకరం రూ. 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమికంతా మళ్ళీ టెండర్లు పిలవాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినంత మాత్రాన.. ఒకవేళ పక్కా ఆధారాలు ఉన్నా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం లేదు. కోర్టులైనా ఆదేశించాలి లేకపోతే తెలంగాణ ప్రభుత్వమే సిఫార్సు చేయాలి. ఆ రెండు జరిగే పరిస్థితి లేదు. అందుకే బీజేపీ నేతలను రేవంత్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తారు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయరని.. వారు వారు ఒకేటేనని రేవంత్ విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోడీ,అమిత్ షాలతో చెప్పి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement