మొదటి రోజే చట్టాలు వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవని, వందల మంది రైతులు ప్రాణాలు పోవడానికి మోడీని కారణమయ్యారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్షతో పోరాటం చేశారన్నారు. ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో… రైతులు కూడా అదే స్ఫూర్తి తో ఉద్యమం చేశారన్నారు. దేశంలో గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవాలని చూస్తున్నారన్నారు. వ్యవసాయం అదాని.. అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూశారన్నారు.
ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాలు రద్దుతో రైతులు విజయం సాధించారన్నారు. రైతు ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలబడిందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షాన పాదయాత్ర చేశానన్నారు. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన నరరూప రాక్షసుడు మోడీ అని, రైతులు మోడీని క్షమించరన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా కేసీఆర్ వ్యతిరేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశామన్నారు. వ్యవసాయం సంక్షోభంకు కారణం మోడీ, కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ లో చట్టానికి అనుకూలంగా కేసీఆర్ ఓటేశారన్నారు. సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే దైర్యం లేదు కానీ క్రెడిట్ నాది అంటున్నారని, ఇది రైతులను అవమానించడమేనన్నారు.