Thursday, December 19, 2024

Question Hour – అసెంబ్లీ లో మంత్రి కోమ‌టిరెడ్డి, హ‌రీష్ రావుల ల‌డాయి..

హరీశ్‌రావు ఏమ‌న్నా డిప్యూటీ ఫ్లోర్ లీడరా?
దీనిపై క్లారిటీ ఇవ్వాల‌న్న‌ మంత్రి కోమ‌టిరెడ్డి
కోమ‌టిరెడ్డి, హ‌రీశ్‌రావు మ‌ధ్య వాగ్వాదం
వారే ప్ర‌శ్న‌లు అడిగితే ఎలా?
ప్ర‌శ్నోత్త‌రాల‌కు అర్థ‌మే మారిపోతుంది
మూడు ప్ర‌శ్న‌ల‌కే స‌భాస‌మ‌యం స‌రిపోతోంది
రాజ‌కీయ ప్ర‌సంగాలు మాని సూటిగా ఆన్స‌ర్ ఇవ్వాలి
శాస‌నస‌భ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్: అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్లగొండ జిల్లాలోని నీటి సమస్యలను గురించి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు జోక్యం చేసుకుని మంత్రులే ప్ర‌శ్నలు వేస్తే ప్ర‌శ్నోత్త‌రాల‌కు అర్థ‌మే మారిపోతుంద‌ని అన్నారు. దీంతో వారి మ‌ధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విష‌యాన్ని ఏ హోదాలో అడుగుతున్నార‌ని హ‌రీశ్‌రావును మంత్రి కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించారు. మంత్రులు రాజ‌కీయ ప్ర‌సంగాలు మాని స‌మాధానాలు సూటిగా చెబితే రోజుకు ప‌ది ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు వ‌స్తాయ‌ని, ప్ర‌స్తుతం మూడు ప్ర‌శ్న‌ల‌కే స‌భాస‌మ‌యం స‌రిపోతుంద‌ని ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రిప్ల‌య్ ఇచ్చారు.

కేబినెట్ ఉంటుండ‌గా…

- Advertisement -

మంత్రి కోమ‌టి రెడ్డి ప్ర‌శ్న‌ల‌కు హ‌రీశ్‌రావు అభ్యంత‌రం తెలిపారు. కేబినెట్‌ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయమని, క్వశ్చన్‌ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని హ‌రీశ్‌రావు అన్నారు. ఇలా అయితే.. ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. కొత్త సంప్ర‌దాయ‌న్ని సభలో తీసుకురావద్దని స్పీకర్ ప్ర‌సాద్‌ను హ‌రీశ్‌ కోరారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారని, వారి హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందని మండిప‌డ్డారు. అప్పుడు వారు సరిగ్గా చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

ఏ హోదాలో అడుగుతున్నారు?

అయితే.. ఈ విష‌యాన్ని త‌న‌ను ఏ హోదాలో అడుగుతున్నారని హరీశ్‌రావును మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఆయనకు అడిగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను కోరారు. ఏడాదిగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అసలు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కేసీఆరా.. హరీశా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై తాము పోరాడుతున్నామని లెక్చర్లు ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హరీశ్‌రావు డిప్యూటీ ఫ్లోర్ లీడారా? ఆయనది ముందు ఏ హోదానో చెప్పాలని ఫైర్ అయ్యారు.

నిర్ల‌క్ష్యం చేసింది మీరే.. మంత్రి కోమ‌టిరెడ్డి

రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి ఆరోపించారు. నల్గొండ ప్రజల గురించి, తన గురించి సభలో మాట్లాడే నైతిక హక్కు హ‌రీశ్ రావుకు లేద‌ని మండిప‌డ్డారు. కాగా, హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్‌ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించేదే బీఆర్‌ఎస్‌ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో, తాము ఏం చేశామో అన్న విష‌యంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

మూడు ప్ర‌శ్న‌ల‌కే స‌భాస‌మ‌యం స‌రిపోతుంది : హ‌రీశ్‌రావు

ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నకు సూటిగా జవాబు వచ్చినట్లయితే పది ప్రశ్నలకు ఆన్సర్‌ వచ్చే అవకాశం ఉంద‌ని హ‌రీశ్‌రావు అన్నారు. ప్రతిరోజు మూడు నాలుగు ప్రశ్నలకే సభాసమయం సరిపోతుందని, ఒక్కో ప్రశ్నకు సూటిగా సమాధానం వచ్చేలా చూడాలన్నారు. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే తాము కల్పించుకోవాల్సి వస్తుందన్నారు. అలాంటి వాటికి మరోసారి అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌ను హ‌రీశ్‌రావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement