ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకున్న ప్రజలు
నిరసనలు… ఆందోళనలు..
మాజీ ఎమ్మెల్యేలు ముందస్తు అరెస్ట్
ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి నల్లగొండ : రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని ప్రజలు ఏకాభిప్రాయంతో స్పష్టం చేశారు. నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. సదస్సు దగ్గర అంబుజా సిమెంట్ గో బ్యాక్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థలు వెనక్కి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల నినాదాలతో రామన్నపేటలో ఉద్రికత్త పరిస్థితి చోటు చేసుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న యాదాద్రి, నల్లగొండ జిల్లా పోలీసులు ప్రజలను అదుపు చేయడానికి ప్రయత్నించారు.
రామన్నపేటలో భారీ పోలీసు బందోబస్తు
రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును గత కొంత కాలంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు పలు ప్రజాసంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏ ర్పాటు చేసేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం చేపట్టారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాదాద్రి, నల్లగొండ జిల్లాకు చెందిన పోలీసులను భారీగా మోహరించారు.
పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యేలు
ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ సదస్సుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి ని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, భూపాల్ రెడ్డిని వారి నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో సదస్సు ప్రాంతానికి వెళ్లలేకపోయారు.
ఇక్కడే ఏర్పాటు ఎందుకంటే…
రామన్నపేట మండలంలో సిమెంట్ నిక్షేపాలు లేవు. అయితే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. గూడ్స్‌ల ద్వారా ముడి సరుకు తీసుకు వచ్చి, ఫ్యాక్టరీలో మిక్సింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని అంబుజా రామన్నపేటను ఎంచుకుంది. ఛత్తీస్‌గడ్-వరంగల్ జాతీయ రహదారి, రైల్వే లైన్ ఉండడంతో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని అంబుజా యాజమాన్యం భావించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వ స్థలాన్ని ఇండ్రస్ట్రియల్ పార్కు కోసం కేటాయించారు. అప్పటి ప్రభుత్వం డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఇదే స్థలంలో సుమారు 63 ఎకరాల్లో 6.0 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందు కు అంబుజా గ్రూప్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంబుజా గ్రూప్స్ అధినేత ఆదాని వంద కోట్లు విరాళంగా ఇచ్చారని, అందుకే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరశం మౌనం వహించారని ఇక్కడ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే మూసీ కాలుష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామన్నపేట మండలంలో కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే జిల్లా చిత్రపటంలో రామన్నపేట నామరూపా ల్లేకుండా పోతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజలను, ప్రజాసంఘాల నాయకులను ప్రజా ప్రతినిధులను, పార్టీ ల నాయకులను అరెస్ట్ చేసి, గృహ నిర్బంధాలు చేసి, ఏ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటరని ఆయన ప్రశ్నించారు. బహుశా ఇది కోదండరాం, హరగోపాల్ ల మార్క్ ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాపరిపాలన కావొచ్చ అని పేర్కొన్నారు. ఇప్పటికైన వారిద్దరు గొంతు విప్పుతారా? అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా యాదాద్రి, రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ నిర్బంధాలకు బాధ్యత వహించాల్సివస్తాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, దీనితో లక్ష యాభై వేల కోట్ల మూసి ప్రక్షాళన మర్మమేంటో ప్రజలకు అర్ధం అయిందని చెప్పారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.