హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్ ఎంసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఎంసెట్ పరీక్షలు వర్షాల కారణంగా వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారమైతే రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు.. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో జరగాలి. ఈ పరీక్షలకు మొత్తం 2,66,445 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌కు 94,150 మంది అభ్యర్థులు కాగా, ఇంజనీరింగ్‌కు 1,71,945 మంది, రెండింటికి కలిపి మరో 350 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈసారి 14,500 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలకు తెలంగాణలో 85, ఆంధ్రప్రదేశ్‌లో 24 సెంటర్లను ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈసారి 5 పరీక్షా కేంద్రాలను పెంచారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం సెషన్ పరీక్ష 3 గంటల నుంచి 6 గంటల వరకు జరగాల్సి ఉంది.
అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఎంసెట్ పరీక్షలపై అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే టీఎస్ ఈసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఈనెల 11న తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టత ఇవ్వడంతోపాటు, ఎంసెట్ పరీక్షను యధాతథంగా నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఎంసెట్ పరీక్షల నిర్వహణకు ఈ రోజు ఒక్కరోజే గ్యాప్ ఉంది. ఇంకనూ రాష్ట్రంలో వర్షాలు ఏమాత్రం తగ్గడంలేదు. దాంతో ఎంసెట్ వాయిదా వేస్తరనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోపక్క తెలంగాణ ఉన్నత విద్యామండలి మాత్రం వర్షాలు తగ్గితే నిర్వహిస్తామని, లేకపోతే రేపు, ఎల్లుండి జరిగే అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలను వాయిదా వేసి, ఈనెల 18, 19, 20న జరిగే ఇంజనీరింగ్ పరీక్షలను యధాతథంగా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్ష కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాయాలంటే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు చెప్తున్నారు. ఈక్రమంలోనే ఎంసెట్‌ను వాయిదా వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోంది. పరీక్ష నిర్వహణపై ఈరోజు తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టత ఇచ్చే అవకాశముంది…
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.